Begin typing your search above and press return to search.

జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్... ప్రస్తుత పరిస్థితి ఇదే!

ఈ క్రమంలో సుధీర్ రెడ్డి దూకుడు చర్చనీయాంశం అయ్యింది. వెరసి.. ఇప్పుడు జమ్మలమడుగులో టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2024 12:28 PM GMT
జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్... ప్రస్తుత పరిస్థితి ఇదే!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగానే జరిగిందని చెబుతుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో జరిగిన ఘటన కీలకంగా మారింది. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి దూకుడు చర్చనీయాంశం అయ్యింది. వెరసి.. ఇప్పుడు జమ్మలమడుగులో టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు.

అవును... ఏపీలో సోమవారం పోలింగ్ జరిగిన సమయంలో... జ‌మ్మల‌మ‌డుగులో ఎన్నిక‌ల తీరును ప‌ర్యవేక్షించ‌డానికి వెళ్లారు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌ రెడ్డి. ఈ సమయంలో ఆయనపై టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడికి ప్రయ‌త్నించాయి! ఈ దాడుల్లో ఆయనకు గాయలవ్వడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది! దీంతో సుధీర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశానికి లోన‌య్యారు.

ఈ నేపథ్యంలో... తమ ఎమ్మెల్యేపై దాడి చేశారని తెలిసి, వైసీపీ శ్రేణులు ఆయ‌న‌కు మ‌ద్దతుగా వేలాదిగా త‌ర‌లివెళ్లాయి. ఈ సందర్భంగా దెబ్బకు దెబ్బ కొట్టడానికి ఏకంగా జ‌మ్మల‌మ‌డుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయ‌ణ‌రెడ్డి స్వగ్రామం దేవ‌గుడికి వెళ్తార‌నే ప్రచారం జ‌రిగింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ శ్రేణులను సముదాయించే ప్రయత్నం చేశారు.

దీంతో... సోమవారం రాత్రి ఉన్నంతలో ప్రశాంతంగా గడిచిందని చెబుతున్నారు. ఈ సమయంలో మంగళవారం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. ఉద‌యం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. జ‌మ్మల‌మ‌డుగు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఈ సమయంలో ఆయ‌న వెంట 400 వాహ‌నాలు క‌దిలాయి. దీంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది!

ఇలా సుధీర్ రెడ్డి సుమారు 400 వాహనాల్లో బయలుదేరారని తెలియడంతో పోలీసులు ముద్దనూరు వ‌ద్ద పోలీస్ అధికారులు అడ్డుకున్నారు.. గొడ‌వ‌లు వ‌ద్దంటూ స‌ర్ది చెప్పారు. దీంతో రియాక్ట్ అయిన సుధీర్ రెడ్డి... తాను గొడ‌వ‌ల‌కు వెళ్లడం లేద‌ని.. త‌మ నాయ‌కుల‌కు, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మాత్రమే జ‌మ్మల‌మ‌డుగుకు వెళ్తున్నట్టు పోలీసులకు చెప్పారు.

మ‌రోవైపు ఎమ్మెల్యే త‌మ‌పైకి వ‌స్తున్నార‌నే స‌మాచారంతో ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్‌ రెడ్డి అప్రమ‌త్తం అయ్యారు! త‌మ పార్టీల శ్రేణుల‌తో వాళ్లిద్దరు కూడా జ‌మ్మల‌మ‌డుగుకు బ‌య‌ల్దేర‌డానికి రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసి పోలీస్ అధికారులు దేవగుడికి వెళ్లి వాళ్లిద్దర్ని గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో... జ‌మ్మల‌మ‌డుగులో పరిస్థితి వేడెక్కిందని, టెన్షన్ గా ఉందని అంటున్నారు.

మరోపక్క ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.