Begin typing your search above and press return to search.

జ‌మ్ముక‌శ్మీర్‌లో రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ‌.. వ‌ద్దంటున్న యువ‌త‌!

By:  Tupaki Desk   |   25 Dec 2024 6:30 PM GMT
జ‌మ్ముక‌శ్మీర్‌లో రిజ‌ర్వేష‌న్ల ర‌గ‌డ‌.. వ‌ద్దంటున్న యువ‌త‌!
X

జ‌మ్ము క‌శ్మీర్‌.. ఈ పేరు చెప్ప‌గానే.. ఉగ్ర‌దాడులు, రాజ‌కీయ అస్థిర‌త‌.. వంటి ప‌లు అంశాలు క‌నిపిస్తాయి. పైగా.. జ‌మ్ము క‌శ్మీర్ ఈ దేశంలోనే ఒక ప్ర‌త్యేక ప్రాంతం. అయితే.. ఇవ‌న్నీ ఒక‌ప్పుడు.. ఐదేళ్ల కిందట జ‌మ్ము క‌శ్మీర్ కు ద‌ఖ‌లు ప‌డిన ప్ర‌త్యేక రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ ఆర్టిక‌ల్ 370 ర‌ద్ద‌యిన త‌ర్వాత‌.. ప‌రిస్థితి మారిపోయింది. జ‌మ్ము క‌శ్మీర్‌లోని ల‌ద్ధ‌క్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. అదేస‌మ‌యంలో జ‌మ్ము క‌శ్మీర్‌ను ఎన్నిక‌లతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించారు.

దీంతో అప్ప‌టి వ‌ర‌కు జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు ఉన్న ప్ర‌త్యేక ఆర్టిక‌ల్ ర‌ద్ద‌యింది. ఆర్టిక‌ల్ 370 ద్వారా.. అప్ప‌టి వ‌రకు ఉన్న అవ‌కాశాలు.. హ‌క్కులు కూడా త‌గ్గిపోయాయ‌నే చెప్పాలి. దీనిలోని కీల‌క అంశ‌మే రిజ‌ర్వేష‌న్లు. దేశ‌వ్యాప్తంగా రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం.. అంద‌రికీ తెలిసిందే. 50 శాతం జ‌న‌ర‌ల్‌కు కేటాయించ గా.. మిగిలిన 50 శాతంలో ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు రిజ‌ర్వేషన్లు క‌ల్పిస్తున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల మాదిరిగానే క‌శ్మీర్ కూడా ఏర్ప‌డడంతో దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న రాజ్యాంగ మే ఇక్క‌డ కూడా అమ‌ల‌వుతోంది.

ప్ర‌త్యేకంగా.. ఎలాంటి హ‌క్కులు, అవ‌కాశాలు లేకుండా పోయాయి. ఇదే.. ఇప్పుడు అక్క‌డి యువ‌తలో చిచ్చు పెట్టింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు కార‌ణంగా.. వారు కోల్పోతున్న రిజ‌ర్వేష‌న్ల‌ను వారు స‌హించ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌మ రిజ‌ర్వేష‌న్ల‌ను త‌మ‌కు ఇచ్చి తీరాల‌ని వారు ప‌ట్టుబడుతున్నారు. ఇది వివాదానికి దారి తీసి.. ప్ర‌స్తుతం ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్ర‌బుత్వం ఇర‌కాటంలో ప‌డింది. రిజ‌ర్వేష‌న్లు మార‌డంతో మెరిట్ విద్యార్థుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్న‌ది విద్యార్థుల వాద‌న‌.

తేడా ఇదే!

+ ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు కాక‌ముందు రిజ‌ర్వేష‌న్లు: జ‌న‌ర‌ల్ 70%, ఎస్సీ 5%, ఎస్టీ 5%, ఓబీసీ 15%, ఇత‌ర వర్గాలు 5%. అయితే... మైనారిటీ ముస్లిం యువ‌త అంతా జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఉండే స‌రికి.. వారికి ఎక్కువ ఫ‌లాలు ద‌క్కాయి.

+ ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అయిన త‌ర్వాత‌: జ‌న‌ర‌ల్ 50%, ఎస్సీ 20%, ఎస్టీ 15%, బీసీ 15% మేర‌కు రిజ‌ర్వేష‌న్ ద‌క్కుతోంది. దీనిని విద్యార్థులు వ్య‌తిరేకిస్తున్నారు.