Begin typing your search above and press return to search.

అక్కడ పదేళ్ల తర్వాత ఎన్నికలు!

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎన్నికలు జరిగి పదేళ్లు పూర్తయిపోయింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 10:30 AM GMT
అక్కడ పదేళ్ల తర్వాత ఎన్నికలు!
X

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎన్నికలు జరిగి పదేళ్లు పూర్తయిపోయింది. చివరిసారిగా జమ్మూకాశ్మీర్‌ లో 2014లో ఎన్నికలు జరిగాయి. నాడు బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పీడీపీకి చెందిన ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఆయన మరణించడంతో ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు.

2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. 2018 నుంచి రాష్ట్రపతి పాలనలో జమ్మూకాశ్మీర్‌ ఉంది. 2019లో దీన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. అలాగే లడఖ్‌ ను జమ్మూకాశ్మీర్‌ నుంచి వేరు చేసి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది.

జమ్మూకాశ్మీర్‌ లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 25, పీడీపీ 28 స్థానాల్లో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

మళ్లీ సరిగ్గా పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు గుర్తులను కేటాయించేందుకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన పార్టీలకు ఇప్పటికే ఎన్నికల గుర్తులు ఉన్నాయి. గుర్తింపు లేని పార్టీలకు, రిజిస్టర్‌ అయిన పార్టీలకు ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

సాధారణంగా ఎన్నికల గుర్తుల కోసం దరఖాస్తుల ప్రక్రియ అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు ప్రారంభమవుతుంది. అయితే 2018లోనే అసెంబ్లీ రద్దు కావడం, అప్పటి నుంచి రాష్ట్రపతి పాలనలోనే ఉండటంతో ప్రస్తుతం ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియను ఎన్నికల సంఘం ఇప్పుడు మొదలు పెట్టింది.

2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్‌ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఈసీ ప్రారంభిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

కాగా తాజా లోక్‌ సభ ఎన్నికల్లో జమ్మూ – కాశ్మీర్‌లో 58.58% ఓటింగ్‌ నమోదైంది. జమ్మూకాశ్మీర్‌ లో ఈ స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతకంటే ఎక్కువ ఓటింగ్‌ శాతం నమోదువుతుందనే అంచనాలు ఉన్నాయి.

కాగా 2019లో రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్‌ (అసెంబ్లీతో కూడినది), లడఖ్‌ (అసెంబ్లీ లేకుండా) లుగా కేంద్రం విభజించింది. లోక్‌ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించడానికి 2020లో డీలిమిటేషన్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ కాశ్మీర్‌లో 47, జమ్మూలో 43 సీట్లు కలిపి మొత్తం 90 మంది సభ్యులు అసెంబ్లీలో ఉండాలని నిర్ణయించింది. దీంతో ఈసారి 90 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు పరిపాలనా యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. ఐదు దశల్లో ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ అంశంపై జూన్‌ 24 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు సంబంధిత అధికారులకు శిక్షణ ప్రారంభమవుతుంది.

కాగా ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి రెండు స్థానాలు మాత్రమే లభించాయి. దీంతో ఒకరికి ఇండిపెండెంట్‌ హోదాలో మంత్రివర్గంలో ప్రధాని మోదీ స్థానం కల్పించారు. ఉదంపూర్‌ ఎంపీగా గెలిచిన జితేంద్ర సింగ్‌ కు మంత్రి పదవి దక్కింది. జమ్మూకాశ్మీర్‌ లో మొత్తం ఐదు ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి.