Begin typing your search above and press return to search.

రాజు తలుచుకుంటే కొదవా.. అంబానీ తల్చుకున్నా అంతే!

దీంతో రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా.. ముకేశ్‌ అంబానీ తల్చుకుంటే జరగనిది ఏదైనా ఉందా అని చెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 8:31 AM GMT
రాజు తలుచుకుంటే కొదవా.. అంబానీ తల్చుకున్నా అంతే!
X

ప్రపంచ టాప్‌ టెన్‌ అపర కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు అనంత్‌ వివాహం రాధికా మర్చంట్‌ తో జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో ఇప్పటికే ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేశారు. దేశవిదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, అపర కుబేరులు, సినీ, క్రీడా రంగాల సెలబ్రిటీలు ఈ వేడుకలకు తరలివస్తున్నారు.

ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్, ఆయన సతీమణి భారత్‌ కు వచ్చారు. ఇక మనదేశంలో బాలీవుడ్, క్రీడా రంగాల సెలబ్రిటీలు అంతా వేడుకల్లోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ లో ఒక మాదిరి పట్టణమైన జామ్‌ నగర్‌ అంతర్జాతీయ నగరంలా శోభిల్లుతోంది. అంబానీ కుమారుడి పెళ్లిని పురస్కరించుకుని జామ్‌ నగర్‌ పట్టణమంతా సెట్టింగులతో తీర్చిదిద్దారు. మరోవైపు జామ్‌ నగర్‌ లో చిన్నపాటి దేశీయ విమానాశ్రయమే ఉండగా దాన్ని అంబానీ కుమారుడి పెళ్లి అయ్యే వరకు దానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ హోదాను ఇచ్చారు.

దీంతో రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా.. ముకేశ్‌ అంబానీ తల్చుకుంటే జరగనిది ఏదైనా ఉందా అని చెప్పుకుంటున్నారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ.. జామ్‌ నగర్‌ విమానాశ్రయానికి పది రోజుల పాటు అంతర్జాతీయ హోదాను కల్పించింది. మార్చి 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మార్చి 10 వరకు జామ్‌ నగర్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఉంటుంది.

అంబానీ కుమారుడు అనంత్‌ పెళ్లికి దేశ విదేశాల నుంచి రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యం కోసం జామ్‌ నగర్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను కల్పించారు.

అంతేకాకుండా అంబానీ విజ్ఞప్తి మేరకు జామ్‌ నగర్‌ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ప్యాసింజర్‌ టర్మినల్‌ భవనాన్ని కూడా నిర్మించారు. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచారు. వీవీఐపీల రాకతో జామ్‌ నగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచ స్థాయిలో ఇప్పుడు గుర్తింపు లభిస్తోంది.