సీనియర్ కాంగ్రెస్ నేతకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి?
అయితే, తలపండిన సీనియర్ నాయకుడైన ఆయన సేవలనూ కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటోంది.
By: Tupaki Desk | 7 March 2025 5:25 PM ISTతెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన.. తెలంగాణ వచ్చాక తొలి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే.. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రస్తుతం ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. అయితే, తలపండిన సీనియర్ నాయకుడైన ఆయన సేవలనూ కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటోంది. అందుకని ఆయనకు ఓ కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఉమ్మడి రాష్ట్ర మాజీ హోం మంత్రి, నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డికి తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పీట దక్కనుంది. ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు ఆయనకు నేరుగా ఎలాంటి పదవీ దక్కలేదు. అయితే, పరిస్థితుల రీత్యా జానారెడ్డి సేవలు అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే జానారెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చేందుకు నిర్ణయించారని సమాచారం.
రేవంత్ స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ కాసేపు సమావేశం అయ్యారు. పలు అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అడిగితే సలహాలు సూచనలు ఇస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయనకు ముఖ్య సలహాదారు పదవిని సీఎం రేవంత్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హోం సహా అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం లేదా ఎంపీగా ఢిల్లీకి పంపుతారనే కథనాలు వస్తున్నారు. నరేందర్ రెడ్డి ఎంపీ అయితే, అధిష్ఠానంతో సంప్రదింపులకు సులువుగా ఉంటుందని రేవంత్ భావిస్తుండవచ్చు. నరేందర్ రెడ్ది అటు వెళ్తే ఆ పదవిని జానారెడ్డికి ఇవ్వాలనేది యోచన కావొచ్చు.