Begin typing your search above and press return to search.

జానారెడ్డి గారు.. సీఎం త‌ర్వాత ముందు పార్టీ సంగ‌తి చూడండి!

తీరాచూస్తే కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో జానారెడ్డి పేరు లేదు. బ‌దులుగా ఆయ‌న త‌న‌యుడికి అవ‌కాశం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 3:15 AM GMT
జానారెడ్డి గారు.. సీఎం త‌ర్వాత ముందు పార్టీ సంగ‌తి చూడండి!
X

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి త‌న‌కోసం ఎదురుచూస్తోంద‌ని, రాబోయే కాలంలో ఆ సీటుపై కూర్చుండే చాన్స్ రానుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి ఈ మ‌ధ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నేత అయిన జానారెడ్డి కామెంట్లు స‌హ‌జంగానే చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

తీరాచూస్తే కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో జానారెడ్డి పేరు లేదు. బ‌దులుగా ఆయ‌న త‌న‌యుడికి అవ‌కాశం ఇచ్చారు. ఇదిలాఉంచితే, సీఎం పీఠంపై జానారెడ్డి ఫోక‌స్ పెట్ట‌డం ఏ మాత్రం త‌ప్పులేద‌ని అయితే అప్ప‌టిలోగా త‌న‌కు కాంగ్రెస్ పార్టీ అప్ప‌గించిన బాధ్య‌త‌ల గురించి ఎందుకు దృష్టి సారించ‌డం లేద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లే కామెంట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన‌ రెండు జాబితాల్లోనూ చాలా మంది ముఖ్యుల‌కు టికెట్ దక్కక‌పోవ‌డంతో స‌హ‌జంగానే వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడటంతో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సెకండ్ లిస్టులో తనకు జూబ్లీ హిల్స్ టికెట్ దక్కుతుందని ఆశించిన దివంగత మంత్రి పీ జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

ఆయన బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మ‌రోవైపు ఉప్పల్ టికెట్ ఆశించి భంగ పడ్డ రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొన్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన దండెం రామిరెడ్డి తన అనుచరులతో సమావేశమై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని మీడియాకు వెల్లడించారు. మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉండ‌గా పార్టీ మారాలని, లేదాంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎల్లారెడ్డి టికెట్ ను సుభాష్ రెడ్డికి కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. తీవ్ర నిరాశతో ఉన్న సుభాష్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.

ఇలా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేత‌లు ఇలా భ‌గ్గుమంటుంటే జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఏం చేస్తోంది అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అసంతృప్త నేతలు పార్టీ మారకుండా ఎందుకు ఆప‌లేక‌పోతోంది? కీలక నేతలు రెబల్స్ గా బరిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ప్రత్యర్థి పార్టీలో చేరుతుండ‌టం స‌హజంగానే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతీసే అంశం. ఈ నేప‌థ్యంలో జానారెడ్డి ఇలాగే సైలెంట్‌గా ఉంటే నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగుతుందని, నేతలను ఢిల్లీ పిలిపించుకొని బుజ్జగించనుంద‌ని అంటున్నారు.