పవన్ బర్త్‌డే.. బ్యాడ్ న్యూస్!
ఇలా దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. దుర్ఘటన జరగటం దురదృష్టకరం అని, గోపి ఆత్మకు శాంతి కలగాలని పవన్ పేర్కొన్నారు.
By: Tupaki Desk | 3 Sep 2024 4:55 AM GMTఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సెప్టెంబరు 2. సోమవారం పుట్టిన రోజు చేసుకున్నారు. అయితే.. ఆయన పట్టిన రోజు నాడు పార్టీకి, వ్యక్తిగతంగా పవన్‌కు కూడా.. ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. అదే.. జనసేన పార్టీ కార్యకర్త, పవన్ వీరాభిమాని ఒకరు మృతి చెందారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో గోపి అనే యువకుడు జనసేనలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పవన్ అంటే వీరాభిమాని. ఎన్నికల సమయంలోనూ ఆయన పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే పవన్ బర్త్‌డే ను పురస్కరించుకుని.. స్థానికంగా భారీ ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో తన మిత్రుడు మధుతో కలిసి ఊరంతా ఫ్లెక్సీలు కట్టే పనిలో పడ్డాడు గోపి. కొన్ని చోట్ల కరెంటు స్థంబాలకు కూడా ఫ్లెక్సీలు కట్టారు. అయితే.. వర్షాల కారణంగా విద్యుత్ ప్రవహించి.. ఇద్దరికీ కరెంటు షాక్ కొట్టింది. ఈ ఘటనలో గోపి అక్కడికక్కడే మృతి చెందగా.. మధు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యాడు.
దీంతో పార్టీ నాయకులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పవన్ స్పందించారు. తన పుట్టిన రోజు నాడే పార్టీ యాక్టివ్ కార్యకర్త ఇలా దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. దుర్ఘటన జరగటం దురదృష్టకరం అని, గోపి ఆత్మకు శాంతి కలగాలని పవన్ పేర్కొన్నారు.
ఇక, మృతి చెందిన గోపి కుటుంబం వివరాలు చూస్తే.. స్థానికంగా కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఆయనపై ఆధారపడి భార్య,తల్లి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవన్.. కుటుంబ వివరాలు సేకరించారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని.. స్థానిక నాయకులను పవన్ ఆదేశించారు. అదేవిధంగా మధుకి హాస్పిటల్ ఖర్చుల కోసం 50 వేల రూపాయలను అందించాలని పేర్కొన్నారు.