కిరణ్ రాయల్ ఇష్యూ.. జనసేన యాక్షన్ ఏమిటి?
ఈ నేపథ్యంలో పై రెండు ఉదాహరణలను పరిగణలోకి తీసుకున్న పలువురు.. కిరణ్ రాయల్ విషయంలో జనసేన యాక్షన్ ఏమిటి అనే ప్రశ్న లెవనెత్తుతున్నారు.
By: Tupaki Desk | 9 Feb 2025 6:56 AM GMTపార్టీ క్రమశిక్షణ విషయంలోనూ, ఆడపిల్లల రక్షణ విషయంలోనూ పవన్ కల్యాణ్ చాలా స్ట్రిక్ట్ అనే సంగతి తెలిసిందే. ఒక అన్నగా ఆడపిల్లలకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతారు. ఈ నేపథ్యంలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆరోపణలు వచ్చిన వెంటనే.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నామంటూ జనసేన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందేల బరుల వద్ద స్థానిక జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ.. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో.. క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన పార్టీ హైకమాండ్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పై రెండు ఉదాహరణలను పరిగణలోకి తీసుకున్న పలువురు.. కిరణ్ రాయల్ విషయంలో జనసేన యాక్షన్ ఏమిటి అనే ప్రశ్న లెవనెత్తుతున్నారు. పవిత్రమైన తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో కిరణ్ రాయల్ నోటి నుంచి జాలువారిన ఆ పదప్రయోగాలను అసహ్యించుకుంటున్నారని చెబుతున్నారు.
కాగా.. తాజాగా తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత మహిళ లక్ష్మీ తనకు కిరణ్ రాయల్ రూ.1.20 కోట్లు ఇవ్వాలని.. అతనివల్లే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో విడుదల చేశారు. ఇదే సమయంలో.. ఆమెతో అత్యంత నీచంగా మాట్లాడినట్లు ఉన్న ఆడియోలు బయటకొచ్చాయి.
మరోవైపు కిరణ్ రాయల్ ను సొంతపార్టీ నేతలే దూరం పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా.. తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ కిరణ్ రాయల్ తో సఖ్యత లేదని చెబుతున్న పరిస్థితి. పైగా.. ఈ స్థాయిలో వీడియోలు, ఆడియోలు బయటకు వచ్చిన వేళ.. పరిస్థితి పరింత దయణీయం అని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కాళ్లు, చేతులు విరగ్గొడతాననే పవన్ కల్యాణ్ హెచ్చరికలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. దీంతో.. కిరణ్ రాయల్ విషయంలో పవన్ కల్యాణ్ యాక్షన్ ఏమిటి అనేది ఆసక్తిగా మారింది.