పవన్ పార్టీ ఇమేజ్ ను దెబ్బేస్తున్న 'అనుకూల మీడియా'?
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు తీరును సరైనోడు ఎవరూ సమర్థించలేరు.
By: Tupaki Desk | 10 March 2025 9:46 AM ISTఒక పార్టీకి చెందిన నేత ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. అతడ్ని వెనకేసుకొచ్చినట్లుగా వ్యవహరిస్తే.. సదరు నేత తీరును తప్పు పట్టటమే కాదు.. పార్టీని సైతం విమర్శించటంలో అర్థముంది. అందుకు భిన్నంగా పార్టీ అధినేత వాయు వేగంతో స్పందించి.. తప్పుడు పనికి పాల్పడిన నేత మీద చర్యల కత్తి ఝుళిపిస్తే.. తప్పుడు పని చేసిన వాడి తప్పును.. అదే సమయంలో పార్టీ అధినేత తీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..సమాచారం ఇవ్వటం మీడియా చేయాల్సిన పని. అందునా అనుకూల మీడియా అన్న ట్యాగ్ లైన్ ఉన్న సంస్థలు ఇలాంటి అంశాల్లో పవన్ను హీరోగా చూపించే ప్రయత్నం చేస్తాయి. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. చర్చనీయాశంంగా మారింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు తీరును సరైనోడు ఎవరూ సమర్థించలేరు. తన ఈగో కోసం ఒక వైద్యురాలి మీద దురుసుతనాన్ని ప్రదర్శించటం.. నోటికి పని చెప్పటం.. అందరి ముందు అవమానించేలా వ్యవహరించటంతో పాటు.. పార్టీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా వ్యవహరించిన తీరును తప్పు పట్టాల్సిందే. మిగిలినరాజకీయ పార్టీలు అయితే.. ఇలాంటి అంశాల్ని చూసిచూడనట్లుగా వ్యవహరిస్తాయి.
కానీ.. జనసేన మాత్రం అందుకు భిన్నంగా ఆసుపత్రిలో రచ్చ చేసిన తమ నేత తీరుపై నివేదిక తెప్పించుకోవటం.. తప్పుచేసిన విషయాన్ని గుర్తించటం.. ఏ ఆసుపత్రిలో అయితే రచ్చ చేశాడో.. అక్కడే అందరి ఎదుట.. చివరకు అవమానానికి గురైన వైద్యురాలి తల్లిని కూడా రప్పించి.. అందరి ఎదుట క్షమాపణలు చెప్పించటమే కాదు.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం చిన్న విషయం కాదు కదా?
ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేనాని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి కదా? పొగడ్తలు లేకున్నా.. జరిగిన ఘటనకు సంబంధించి పార్టీ స్పందించిన తీరును ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది కదా? అందుకు భిన్నంగా జనసేన నేత దురుసు ప్రవర్తన అంటూ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా మీడియాలో వార్తల్ని ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంతా చేసి.. పార్టీకి వ్యతిరేక మీడియాలో ఇలాంటివి వచ్చాయన్నా అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా ఏపీ అధికార కూటమికి అనుకూలంగా ఉంటుందన్న ఇమేజ్ ఉన్న మీడియా సంస్థల్లోనూ ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
అదేదో కావాలని.. కల్పించుకొని మరీ పొగడ్తల్ని వండి వార్చాలని కోరుకోవటం లేదు. కనీసం.. ఉన్నది ఉన్నట్లుగా చూసినప్పుడైనా.. జనసేన పార్టీ తీరు మిగిలిన రాజకీయ పార్టీలకు ఎంత భిన్నమో.. పార్టీ అధినేత తీరు ఎంత కచ్ఛితంగా ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించాలి కదా? తప్పు చేసినోడు తనోడైనా.. న్యాయం వైపు మాత్రమే నిలిచే తీరును ప్రదర్శించిన జనసేనానిని అభినందించక పోయినా ఫర్లేదు.. డ్యామేజ్ చేసేలా వ్యవహరించకూడదు కదా? అన్నదే అసలు పాయింట్. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థలు ఎందుకు మిస్ అయినట్లు?