కోడి పందేల వద్ద జనసేన జెండాలు... పార్టీ షాకింగ్ డెసిషన్!
ఈ సమయంలో ఆ కోడి పందేల బరుల వద్ద జనసేన జెండాలు కనిపించడంతో పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
By: Tupaki Desk | 16 Jan 2025 12:43 PM GMTఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ముగిసాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో కోడి పందాలు, గుండాట మొదలైన జూద క్రీడలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి కొంతమంది పర్యవేక్షిస్తే, మరికొంతమంది వీక్షించారని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ కోడి పందేల బరుల వద్ద జనసేన జెండాలు కనిపించడంతో పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
అవును... ఈ ఏడాది జరిగిన కోడి పందేల తీవ్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలున్నా, పోలీసుల ఆంక్షలు ఉన్నా రాజకీయ నాయకుల ప్రోద్భలంతో నిర్వాహకులు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందేలు, గుండాట మొదలైన జూద క్రీడలతో పాటు ఆ ప్రదేశంలోనే మద్యాన్ని అందుబాటులో ఉంచారని అంటున్నారు.
అయితే... పలు చోట్ల రాజకీయ పార్టీల జెండాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందేల బరుల వద్ద స్థానిక జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దీంతో... ఈ విషయాన్ని పార్టీ అధిష్టాణం సీరియస్ గా తీసుకుంది. ఈ సందర్భంగా ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్బంగా... నియోజకవర్గంలో కంకిపాడు వద్ద నిర్వహించిన కోడిపందేల ప్రాంగణంలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరమని.. దీనికి బాధ్యులైన మిమ్ములను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని గోపాలకృష్ణకు పార్టీ లేఖ రాసింది.
దీంతో... ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారికమైన సంబంధం లేదు అని లేఖలో పేర్కొంది. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది.