జనసేన ఆవిర్భావ సభ.. యాక్షన్ ప్లాన్ ఇదే... !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి
By: Tupaki Desk | 4 March 2025 10:21 AM ISTఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2014లో ఏర్పడిన జనసేన పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వా త జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కారణంతో దీనిని పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అనేక కమిటీలు వేసి.. ఏర్పాట్లను ఎక్కడా తగ్గకుండా చేస్తున్నారు.
ఇక, జనసేన ఆవిర్భావ సభ విషయానికి వస్తే.. గత పదేళ్ల రాజకీయం వేరు... ఇప్పుడున్న రాజకీయం వేరు అన్నట్టుగా పరిస్థితి మారింది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది. పైగా.. వచ్చే 15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామని పవన్ కల్యాణ్ ఇటీవలే స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చే 15 సంవత్సరాలకు సంబంధించిన దశ-దిశ, పార్టీ కార్యక్రమాలు, నాయకుల తీరు, నిర్దిష్టమైన పొత్తులు వంటి కీలక అంశాలపై ఆయన ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది.
వాస్తవానికి పార్టీ పెట్టి పదేళ్లు అయినా.. ఇప్పటి వరకు బూత్ స్థాయిలో నాయకులు లేకపోవడం గమనార్హం. సాధారణంగా.. బూత్ లెవిల్లో పార్టీకి నాయకుల అవసరం ఎంతో ఉంది. క్షేత్రస్థాయి మెగా అభిమానులు.. పవన్ అభిమానులే ఇప్పటి వరకు జెండాలు కడుతున్నారు. పార్టీ పరంగా చూసుకుంటే.. స్వచ్చందంగా ముందుకు వచ్చిన నాయకులు ఉన్నారే తప్ప.. ఇతమిత్థంగా ముందుకు వచ్చి.. పార్టీ కేటాయించిన పదవులు పొందిన వారు లేరు.
ఈ క్రమంలో బూత్ లెవిల్లోనూ.. గ్రామ, మండల స్థాయిలోనూ జనసేన పార్టీకి నాయకుల కొరత ఉందన్నది వాస్తవం. అదేవిధంగా ప్రతి క్లస్టర్‌లోనూ కీలక నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి కూడా.. చాలా కాలం అయిపోయినా.. ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక, క్షేత్రస్థాయిలో పొత్తులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటిపైనా ఆవిర్భావ సభ వేదికగా.. పవన్ కల్యాణ్ ఏమేరకు దిశానిర్దేశం చేస్తారన్నది చూడాలి.