టీటీడీ బోర్డులో జనసేన నుంచి ముగ్గురు.. అందులో ఒకరు పవన్ బెస్ట్ బడ్డి!
వీరిలో... బొంగునూరి మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బురగపు ఆనంద సాయి ఉన్నారు.
By: Tupaki Desk | 31 Oct 2024 4:45 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలిని 24 మందితో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా టీవీ5 న్యూస్ ఛానల్ అధినేత బీఆర్ నాయుడిని నియమించింది. సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరో 20 మందికి అవకాశం కల్పించింది. ఇదే సమయంలో జనసేన నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.
అవును... టీటీడీ ధర్మకర్తల మండలిని 24 మందితో ఏర్పాటు చేసింది. ఇందులో జనసేన పార్టీ తరుపున ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో... బొంగునూరి మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బురగపు ఆనంద సాయి ఉన్నారు. ఈ విషయాలను, వారి వివరాలను తెలియజేస్తూ జనసేన పార్టీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్!
బొంగునూరి మహేందర్ రెడ్డి:
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేందర్ రెడ్డి.. జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గతంలో “కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్” ఏర్పాటు సమయంలో పవన్ తో కలిసి ప్రయాణించారు. “ప్రజారాజ్యం” పార్టీ సమయంలో “యువరాజ్యం”లో చురుగ్గా పాల్గొన్నారు. అనంతర జనసేనలోనూ క్రియాశీలకంగా పనిచేశారు.
అనుగోలు రంగశ్రీ:
కాపు సామాజికవర్గానికి చెందిన అనుగోలు రంగశ్రీ.. జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. ఈమె స్వస్థలం విజయవాడ. జనసేన పార్టీ కోశాధికారి అయిన ఎంవీ రత్నం సతీమణి అయిన ఈమెకు దైవ భక్తి అపారం అని జనసేన తెలిపింది.
బురగపు ఆనంద సాయి:
శ్రీకాకుళానికి చెందిన ఆనంద సాయి సినీ ఆర్ట్ డైరెక్టర్. ఇదే సమయంలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఆర్కిటెక్ట్ గా పనిచేశారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.
ఈ ముగ్గురునికీ జనసేన నుంచి టీటీడీ బోర్డులో సభ్యులుగా పవన్ కల్యాణ్ సిఫార్సు చేశారు! ఇదే సమయంలొ.. ఈ పాలకమండలిలో సగానికి పైగా ఇతర రాష్ట్రాలకు చెందినవారికి పదవులు దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.