Begin typing your search above and press return to search.

పవన్ పై విమర్శలు....జగన్ పై కేసు.. వైసీపీ అధినేతనూ వదలరా?

అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా అదే తరహా కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.

By:  Tupaki Desk   |   7 March 2025 12:43 PM IST
పవన్ పై విమర్శలు....జగన్ పై కేసు.. వైసీపీ అధినేతనూ వదలరా?
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాను మంచికే వాడుదామంటూ పిలుపునిస్తూ.. తప్పుడు ప్రకటనలు, దూషణలకు దిగుతున్న వారిని అరెస్టు చేయిస్తోంది. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు ఆ పార్టీ నేతలు పలువురు అరెస్టు అయ్యారు. ఇక సోషల్ మీడియా ఇన్ చార్జిగా పనిచేసిన సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుని ప్రస్తుతం అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తోపాటు, సినీ హాస్యనటుడు పోసాని క్రిష్ణమురళి, దర్శకుడు ఆర్జీవీపైనా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా అదే తరహా కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.

ఏపీలో సోషల్ మీడియా కేసులు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అసభ్యపదజాలంతో దూషించారనే ఆరోపణలతో వైసీపీలో పలువురు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకే నేరంపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాష్ట్రంలోని పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీసుస్టేషన్లలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్ పై కేసు నమోదైంది. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ వ్యంగ్యస్త్రాలు సంధించడం తెలిసిందే. అయితే జగన్ విమర్శలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చకు తావిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఈ తరహా విమర్శలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడితే తప్పుగానీ, రాజకీయ విమర్శలపైనా కేసులు పెడతారా? అంటూ వైసీపీ నిలదీస్తోంది.

అయితే మాజీ సీఎం జగన్ ఏ ఉద్దేశంతో పవన్ పై విమర్శలు చేశారోగానీ, రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తల్లో చలనం తీసుకువచ్చారంటున్నారు. ఎన్నికలు అయిన తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న జనసైనికులు.. మాజీ సీఎం జగన్ విమర్శలతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అదేసమయంలో కూటమిలోని టీడీపీ కూడా జగన్ విమర్శలపై ఎదురుదాడి చేసి తామంతా ఒక్కటిగా పనిచేస్తామనే సంకేతాలు పంపిందంటున్నారు. మొత్తానికి కేసు నిలుస్తుందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే పవన్ పై విమర్శల ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థుల్లో ఐకమత్యం చెడిపోకుండా జగనే వారికి ఉపయోగపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.