కండువాలు - ఆధిపత్యం.. ఇదేనా జనసేనకు కావాల్సింది..!
ఇక, సీమలో ఇసుక, మద్యం విషయంలో తమ్ముళ్లే అన్నీ చూసుకుంటున్నారని, తమకు అవకాశం ఇవ్వడం లేదని.. రాష్ట్ర స్థాయి జనసేన నాయకుడు ఒకరు బహిరంగవ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 3 Nov 2024 1:30 PM GMTపార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన నాయకులకు పార్టీ అధినేత పవ న్ కల్యాణ్ హితవు పలుతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని కూడా చెబుతున్నారు. ఎక్కడ ఏసభ పెట్టినా ప్రజల మధ్య నాయకులు గౌరవంగా వ్యవహరించాలని కూడా సూచిస్తున్నారు. ఇది సహజంగా మారిపోయింది. అంటే.. పవన్ చెప్పడం.. నాయకులు తలాడించడం కామన్ అయిపోయింది. కానీ, పాటించే నాయకులు మాత్రం కనిపించడం లేదు.
క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు పంతాలకు, పట్టింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పార్టీ తరఫున ప్రజలకు చేస్తున్న సేవ ఏదైనా ఉందేమో చూద్దామన్నా కనిపించడం లేదు. ఈ రగడ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకే పరిమితం కాలేదు. విజయవాడ, తిరుపతి సహా.. సీమ జిల్లాల్లోనూ కనిపిస్తుండడం గమనార్హం. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. తిరుపతిలో కీలక నాయకుడు ఒకరు అలిగి దూరంగా ఉన్నారు.
కూటమి పార్టీలు కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉందని ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరూ చెబు తున్నారు. అంతేకాదు.. అవసరమైతే.. జనసేన నాయకులు ఒక మెట్టు దిగి సఖ్యతకుప్రాధాన్యం ఇవ్వాల ని అంటున్నారు. కానీ, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం మాధవి టీడీపీపై ఆధిపత్య పోరులో తీరిక లేకుండా ఉన్నారు. అనకాపల్లిలో జనసేన నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీపై నిప్పులు చెరుగుతున్నారు.
గోదావరి జిల్లాల్లో తమ పార్టీ కండువాలు ధరించడం లేదని.. మాజీ ఎంపీపీ రాంబాబు సృష్టించిన రగడ.. ఏకంగా కూటమి పార్టీల సఖ్యతకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక, విజయవాడలో టీడీపీ నేతలు.. తమను కనీసం పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేపై వారు పీకల దాకా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తిరుపతిలో ముఖ్యనేత ఒకరు జనసేన కు దూరంగా ఉంటు న్నారు. అదేమంటే.. తనను టీడీపీ నాయకులు ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని అంటున్నారు.
ఇక, సీమలో ఇసుక, మద్యం విషయంలో తమ్ముళ్లే అన్నీ చూసుకుంటున్నారని, తమకు అవకాశం ఇవ్వడం లేదని.. రాష్ట్ర స్థాయి జనసేన నాయకుడు ఒకరు బహిరంగవ్యాఖ్యలు చేశారు. కానీ, పార్టీ అధినేత వీటి కోసం కాదు కదా.. పోరాటం చేయమని చెప్పింది? అన్న ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం లేకపోవడం గమనార్హం. మరి ఇలానే ఉంటే..జనసేన ప్రజలకు చేరువయ్యేనా? కూటమి లక్ష్యం నెరవేరేనా? అనేది చూడాలి.