జనసేన మంత్రులు దుర్గేష్-నాదెండ్ల.. రిపోర్టు కార్డు వేస్ట్.. !
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న ఇద్దరు కీలక నాయకులు.. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్.
By: Tupaki Desk | 19 Dec 2024 1:30 PM GMTఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న ఇద్దరు కీలక నాయకులు.. కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్. వీరితో పాటు మొత్తం 21 మంది విజయం సాధించినా.. కేవలం పవన్ కల్యాణ్‌తోపాటు వీరిద్దరికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. ఇక, సర్కారు ఏర్పడి ఆరు మాసాలు పూర్తయిన నేపథ్యంలో వీరి గ్రాఫ్ ఎలా ఉంది? ఏం చేస్తున్నారన్న చర్చ సాధారణంగానే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఈ రోజు వెల్లడించనున్నా రు.
ఈ క్రమంలో జనసేన మంత్రుల విషయంపైనా కూటమిలో ఆసక్తిగా మారింది. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్‌లు ఇద్దరూ కూడా.. ఎవరికి వారే దూకుడగా పనిచేస్తున్నారనేది పార్టీ వర్గాల అభిప్రాయం. అయితే.. నాదెండ్లకు పనిచేసేందుకు ఉన్న స్కోప్.. కందులకు లేక పోవడం ఒక్కటే మైనస్ అని అంటున్నారు. ప్రస్తుతం వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉన్నందున ఆయన నేతృత్వం వహిస్తున్న పర్యాటక శాఖను గాడిలో పెడుతున్నారు.
ఇది పూర్తి చేసేందుకు, పర్యాటకం పరంగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపేందుకు మరో ఏడాది సమయం అయినా పడుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే.. కందుల కృషి.. కష్టపడే తత్వాన్ని మాత్రం ఎవరూ తక్కువగా అంచనా వేయడం లేదు. ప్రతి కార్యక్రమానికీ ఆయన హాజరువుతున్నారు. పర్యాటక రంగం అభివృద్ధిపై ఢిల్లీ పెద్దలతోనూ నేరుగా ఆయన చర్చలు జరుపుతున్నారు. దీంతో కందుల పనితీరు బాగానే ఉందని టాక్. ఇక, నాదెండ్ల విషయానికి వస్తే.. ఈయన దూకుడు మామూలుగా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన గోదాములు, నిల్వలపై పడ్డారు. ఇంకా బాధ్యతలు కూడా తీసుకోకుండానే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అ దేవిధంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న బియ్యాన్ని పట్టుకోవడంతోపాటు..రేషన్ అక్రమాలపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు.. వాటికి చెల్లించాల్సిన సొమ్ముల విషయంలోనూ.. నాదెండ్ల చూపుతున్న చొరవ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది. మొత్తంగా చూస్తే.. డిప్యూటీ సీఎం ను పక్కన పెడితే.. జనసేన మంత్రుల పనితీరు.. పీక్స్‌లో ఉందన్న టాక్ వినిపిస్తోంది.