Begin typing your search above and press return to search.

డాక్టర్ పై చేయి చేసుకున్న జనసేన ఎమ్మెల్యే నానాజీ

దీంతో కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్.. డాక్టర్లతో పాటు విద్యార్థులు కలిసి బయట వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. వారు స్థానిక ఎమ్మెల్యే నానాజీ వద్దకు వెళ్లారు.

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:15 AM GMT
డాక్టర్ పై చేయి చేసుకున్న జనసేన ఎమ్మెల్యే నానాజీ
X

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాను తప్పించి.. తప్పుడు పనులు ఏ మాత్రం చేయనంటూ ఒద్దికగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తాజాగా ఒక కొత్త సవాలు ఎదురైంది. తాను చెప్పే మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే నానాజీ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఒక వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నారు.

వైద్యుడు చెప్పే మాటల్ని వినకుండా కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే నానాజీ.. ఆయన మీద చేయెత్తారు. తానేమీ అనలేదని చెబుతున్నా వినని ఎమ్మెల్యే.. ''చంపేస్తా. నన్ను తిట్టాల్సిన పనేంటి నీకు? చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావురా?'' అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు.. వైద్యుడి ముఖాన ఉన్న మాస్క్ ను లాగి.. కొట్టేందుకు ప్రయత్నించారు. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలోని క్రీడా మైదానంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో బయట వ్యక్తులు వాలీబాల్ ఆడుతుండటంతో.. తాము ఆడుకునే వీల్లేకుండా పోయిందని వైద్య విద్యార్థులు ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కాలేజీ సిబ్బంది బయట వ్యక్తులు మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో ఆడుకోకూడదంటూ ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం బయట వ్యక్తులు కాలేజీ గ్రౌండ్ లోకి వాలీబాల్ ఆడేందుకు మైదానానికి వచ్చారు. అక్కడితో ఆగని వారు కవ్వింపు చర్యలు చేపట్టారు.

దీంతో కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్.. డాక్టర్లతో పాటు విద్యార్థులు కలిసి బయట వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. వారు స్థానిక ఎమ్మెల్యే నానాజీ వద్దకు వెళ్లారు. తాము కాలేజీ గ్రౌండ్ లో ఆడుతుంటే.. ఆడుకోనివ్వట్లేదంటూ కంప్లైంట్ చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే నానాజీని కూడా తిట్టేస్తున్నట్లుగా కాస్త కల్పించి చెప్పారు. దీంతో చెలరేగిపోయిన ఎమ్మెల్యే నానాజీ.. శనివారం రాత్రి మెడికల్ కాలేజీ గ్రౌండ్ కు వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యపదజాలంతో తిట్టేశారు.

అక్కడితో ఆగని ఆయన డాక్టర్ ముఖానికి ఉన్న మాస్క్ లాగేసి.. కొట్టేందుకు చెయ్యెత్తారు. ఇక.. ఆయన అనుచరులు ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావును బూతులు తిడుతూ.. .ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యకర్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి మెడికల్ కాలేజీకి వెళ్లి.. ఎమ్మెల్యే నానాజీతో క్షమాపణ చెప్పించారు.

దీంతో.. పరిస్థితి సద్దుమణిగిందని భావిస్తున్నారు. కానీ.. నివురు కప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా వైద్యులు జరిగిన ఘటనపై తీవ్రఆగ్రహంతో ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. దీనికి.. పవన్ కల్యాణ్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిత్యం నీతులు వల్లించే పవన్.. తన పార్టీ ఎమ్మెల్యే చేసిన అతికి ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.