చేసిన తప్పులు దీక్షతో సరి
దాసుని తప్పులు దండంతో సరి అని పాత సామెత. చేసిన తప్పులు దీక్షతో సరి అన్నది కొత్త సామెత.
By: Tupaki Desk | 22 Sep 2024 9:30 PM GMTదాసుని తప్పులు దండంతో సరి అని పాత సామెత. చేసిన తప్పులు దీక్షతో సరి అన్నది కొత్త సామెత. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇదే రూట్ లో వెళ్తున్నారు. ఆయన ఆవేశాన్ని అణచుకోలేకపోయారు. వైద్యుని మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతే ఆ ఆవేశం అణచుకోవడానికి ఆయన దీక్షను చేపడుతున్నారు. సోమవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఆయన దీక్ష చేయబోతున్నారు
ఆ విషయం ఆయనే ప్రకటించారు. తాను చేసిన తప్పుకు ఈ దీక్షతో ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా చెప్పారు. నిజమే ప్రాయశ్చిత్తం కంటే వేరేది ఏదీలేదు. దాని కంటే పరిహారం కూడా మరోకటి లేదు. ఆవేశాన్ని అణచేది దీక్ష మాత్రమే. అన్న పానీయాలు పక్కన పెట్టి ఒక రోజు కూర్చుంటే అవేశం తగ్గుతుంది. ఆలోచన మారుతుంది. శాంతి కూడా వెల్లి విరుస్తుంది. అందుకే పంతం నానాజీ ఈ విధంగా మార్గం ఎంచుకున్నారు అనుకోవాలి.
ఇక్కడ దీక్ష చేయడం కంటే ముందు తప్పు చేశాను అని ఒప్పుకున్నందుకు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియ చెప్పాలి. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకుంటున్నారు అని అంటున్నారు.
పవన్ చేపట్టేది లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందన్న దాని మీద. అలా శ్రీవారి ఉపచారాలలో అపచారం జరిగింది అన్న దానికి ఆయన దీక్ష చేపట్టారు. పంతం నానాజీది స్వీయ తప్పిదానికి ప్రాయశ్చిత్తం. ఈ రెండింటికీ తేడా ఉంది.
విషయానికి వస్తే కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజి వద్ద ఒక వైద్యుని విషయంలో దుర్భాషలు ఆడారు అన్న దాని మీద తప్పు చేశాను అని తెలుసుకుని పంతం నానాజీ దీక్షకు కూర్చుంటున్నారు. సో దీక్ష చేపట్టడం ద్వారా తన తప్పుని దిద్దుకోవడమే కాకుండా మరెప్పుడూ చేయనని కూడా నానాజీ చెప్పబోతున్నారు. ప్రాయశ్చిత్తం మంచిదే కానీ తప్పులు తరచూ చేయకుండా అది కట్టడి చేయాలి. మనసుని శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి.
అపుడే ప్రాయశ్చిత్తానికి అర్ధం పరమార్ధం అని వేదాంతులు చెబుతారు. రాజకీయ నాయకులకు నిత్య యజ్ఞంగా ఉంటుంది. జనంతో వారు ఉంటారు. దాంతో వారి ఎమోషన్స్ కూడా ఒకేలా ఉండలేవు. అలాంటపుడు వారు దీక్షలతోనే తప్పులు దిద్దుకుంటూ పోతే ఎన్ని అలా చేయాలో అన్న చర్చ కూడా వస్తోంది.
ఏది ఏమైనా ఒక్క మాట చెప్పుకోవాలి. జీవితం అశాశ్వతం, అందులో అధికారం ఇంకా అశాశ్వతం. అందువల్ల వచ్చిన అవకాశాన్ని లక్షల జనం మెచ్చకపోయినా నొచ్చుకునేలా ఉండకుండా జాగ్రత్తగా వాడుకుంటే అంతకు మించిన ప్రాయశ్చిత్తం దీక్ష వేరేది ఉండదని అంటున్నారు. మరి ఆ సూచనలను రాజకీయ జీవులు పాటిస్తారా అన్నదే చూడాల్సి ఉంది.