జనసేన ఎమ్మెల్యేల బాధ అదేనా ?
జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 24 March 2025 12:00 AM ISTజనసేనకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు అన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. ఇంతకీ వారు ఈ విధంగా ఎందుకు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ అజెండా ఏమిటి వారి సమస్యలు ఏమిటి అసలు వారికి కావాల్సింది ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇదిలా ఉంటే ఏపీ శాసనసభ సమావేశాలు ముగిసీ ముగియడంతోనే జనసేన ఎమ్మెల్యేలు అంతా కలసి విజయవాడలో ఈ మీటింగ్ పెట్టుకున్నారని అంటున్నారు. ఈ సమావేశంలో జనసేన నంబర్ టూ నాయకుడు మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది.
ఆయనకే ఈ విషయాలు అన్నీ జనసేన ఎమ్మెల్యేలు చెప్పుకున్నారని అంటున్నారు. తన నియోజకవర్గాలలో తగిన గౌరవం లేదని తమ మాట ఏ మాత్రం చెల్లుబాటు కావడం లేదని ఎమ్మెల్యేలుగా తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోతున్నామని జనసేన ఎమ్మెల్యేలు వాపోయినట్లుగా చెబుతున్నారు.
తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జిలు ఉన్నారని వారిదే హవాగా సాగుతోందని అధికారుల వద్ద వారి మాటే చెల్లుతోందని కూడా చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు అక్కడ తమదే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం టీడీపీ ఇంచార్జిలదే పెత్తనం అంటే ఇదెక్కడి న్యాయం అని అంటున్నారు.
నిజంగా ఈ విధంగా జరుగుతోందా అంటే జనసేనలో ఉన్న సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా నెగ్గి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే అలాగే ఉంది. ఒక మాజీ మంత్రి జనసేన టికెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. కానీ అక్కడ అంతా టీడీపీ ఇంచార్జిదే పెత్తనంగా సాగుతోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే మాజీ మంత్రిగా పనిచేసిన ఒక టీడీపీ నేత నియోజకవర్గం మారారు కానీ తన సొంత సీటులో జనసేన ఎమ్మెల్యే గెలిచినా తనదే చెల్లుబాటు కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలలోనూ ఇదే రకమైన వాతావరణం ఉందిట.
దాంతో వారంతా ఈ విషయం మీద అధినాయకత్వం జోక్యం చేసుకుని సరి దిద్దకపోతే తాము ఇబ్బందులో పడతామని అంటున్నారుట. ఇదిలా ఉంటే ఈ సీక్రెట్ మీటింగ్ జరిగింది అన్న ప్రచారం ఉంది కానీ దాని మీద బయటపడి మాట్లాడేందుకు మాత్రం ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారు. ఇక జనసేన అధినాయకత్వానికి ఈ విషయాలు అన్నీ తెలియచేసి ఒక మంచి పరిష్కారం కోసం వారు కోరుకుంటున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.