ట్విస్ట్ ఇచ్చిన జనసేన.. కిరణ్ రాయల్ ఒంటరేనా?
తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 10 Feb 2025 8:22 AM GMTతిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ నేతలను ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, కిరణ్ రాయల్ తనలా ఎంతో మంది మహిళలను మోసం చేశారని బాధితురాలు మరోమారు ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ కు పార్టీ షాక్ ఇచ్చింది. కోటి రూపాయల నగదు, బంగారం తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. కిరణ్ రాయల్ తనను ఎలా వంచించాడో వివరిస్తూ ఆ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలని ప్రతిపక్షం నిలదీసింది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.
కిరణ్ రాయల్ విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం తెలియజేయాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాటి చెప్పాలని నిర్ణయించారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.
పార్టీ నిర్ణయంతో కిరణ్ రాయల్ కు దెబ్బ పడినట్లైంది. జనసేన ఆవిర్భావం నుంచి కిరణ్ రాయల్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీపై విమర్శలు చేయడంలో ముందుంటారు. ఇటీవల జగన్ 2.0 స్టేట్మెంట్ పైనా కిరణ్ రాయల్ విమర్శలు హైలెట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఆరోపణలు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.
2013లో కిరణ్ రాయల్ తన వద్ద డబ్బు తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తుండగా, తాను ఆ డబ్బు ఎప్పుడో ఇచ్చేశానని అందుకు తగిన ఆధారాలు, వీడియో రికార్డులు తన వద్ద ఉన్నాయని కిరణ్ రాయల్ చెబుతున్నాడు. ఈ అంశంపై కోర్టులో తేల్చుకుంటానని ఆయన మీడియాకు తెలిపాడు. అయితే బాధిత మహిళ మాత్రం కిరణ్ రాయల్ వాదనను తోసిపుచ్చుతోంది. తన డబ్బు అడిగితే బెదిరిస్తున్నట్లు వాపోతోంది. కిరణ్ రాయల్ నుంచి రక్షించాలని కోరుతోంది. లేదంటే తనకు చావే శరణ్యమని వాపోతోంది. సోమవారం కూడా తిరుపతిలో మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు కిరణ్ రాయల్ ఎంతో మంది మహిళలను మోసం చేశాడని ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.