జనసేన మీద టీడీపీకి మండుతోందా ?
ఇదంతా ఎందుకు అంటే టీడీపీ జనసేన ఈ రెండూ మిత్ర పక్షాలు కదా మరి ఈ రెండు పార్టీల మధ్య బంధాలు ఎలా ఉన్నాయన్న ఆలోచనలు రావడమే.
By: Tupaki Desk | 4 March 2025 4:00 PM ISTరాజకీయాలు అంటేనే అవకాశాలను అందిపుచ్చుకోవడం. ఒక పార్టీకి మరో పార్టీ ఎన్నికల సమయంలో తప్ప ఎపుడూ అంత మితృత్వం ఉండదు, ఆ విధంగా చూస్తే కనుక కూటమి కట్టిన పార్టీలలోనూ విభేదాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు, అది అత్యంత సహజం కూడా. పాలిటిక్స్ అంటే చాన్స్ కోసం రేసింగ్. ఆ సమయలో ఎవరూ ఫ్రెండ్ షిప్ కోసం త్యాగాలు చేసే సీన్ అయితే ఉండదు.
ఇదంతా ఎందుకు అంటే టీడీపీ జనసేన ఈ రెండూ మిత్ర పక్షాలు కదా మరి ఈ రెండు పార్టీల మధ్య బంధాలు ఎలా ఉన్నాయన్న ఆలోచనలు రావడమే. కూటమిగా మూడు పార్టీలు ఏర్పడి తొమ్మిది నెలలుగా అధికారాన్ని అందుకుంటున్నాయి. అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా ఆయా పార్టీలు వైసీపీ నుంచి నేతలను చేర్చుకునే పనిలో పడ్డాయి.
ఈ విషయంలో మొదట్లో టీడీపీ జోరు చూపించినా ఇపుడు జనసేన దూకుడు చేస్తోంది. ఇక చూస్తే కనుక కూటమిలో ఎవరిని అయినా చేర్చుకోవాలి అనుకుంటే కనీసం చర్చ జరగాలి అని అంటున్నారు. అయితే అలాంటి చర్చలేమీ లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. జనసేన ఆ విధంగా వైసీపీ అసంతృప్తులను చేర్చుకుంటోంది. తాను రానున్న రోజులలో సొంతంగా ఎదగాలని జనసేన తాపత్రయపడుతోంది. ఈ విషయం పెద్దన్నగా ఉన్న పార్టీ టీడీపీ పసిగట్టకుండా ఉంటుందా. అందుకే టీడీపీ జనసేన రాజకీయ కార్యకలాపాలు జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇక జనసేన అధినాయకత్వం పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తోంది. జనసేనకు 2024 ఎన్నికల్లో కేవలం 6.5 ఓటు శాతం మాత్రమే వచ్చింది. దాంతో మరింతగా బలపడేందుకు ప్రతీ నియోజకవర్గంలో బలమైన నేతలను చేర్చుకునేందుకు రెడీ అవుతోంది. ఒకటి రెండు సార్లు గెలిచిన వారు ఆయా నియోజకవర్గాలలో కనీసంగా 20 శాతం ఓటు షేర్ ని సొంతంగా కలిగి ఉంటారని భావిస్తూ అలాంటి వైసీపీ నేతలనే జనసేనలోకి చర్చుకోవడానికి చూస్తోంది అని అంటున్నారు.
ఈ విధంగా ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం ఓటు షేర్ తక్కువ కాకుండా ఉన్న బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే జనసేన పూర్తిగా ప్రిపేర్ అవుతోంది. ఆనాటి ఎన్నికల్లో కనుక తన ఓట్లూ సీట్లూ గణనీయంగా పెంచుకుంటే సీఎం సీటుని షేరింగ్ లో భాగంగా డిమాండ్ చేయవచ్చు అన్నది జనసేన ఆలోచనగా ఉందని చెబుతున్నారు.
మహారాష్ట్రలో మాదిరిగా కూటమి కట్టి ఆయా పార్టీల బలాబలాలను బట్టి సీఎం సీటు షేరింగ్ తో అధికారం అనుకుంటున్నారు అని జనసేన భావిస్తోంది. ఆ తరహా రాజకీయాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తోంది అంటున్నారు.
ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఏకంగా 20 శాతం ఓటు షేర్ ని ఏపీలో జనసేన సాధించాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం టార్గెట్ గా ఉందని అంటున్నారు. ఆ విధంగా చేస్తే కనుక కచ్చితంగా తమ ఓటు షేర్ చూసి అయినా టీడీపీ కాళ్ళ బేరానికి వస్తుందని అపుడు సీఎం షేర్ అన్నది ఒక డిమాండ్ గా పెట్టినా ఓకే చేసేందుకు నూరు శాతం అవకాశాలు ఉంటాయని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు.
అంతే తప్ప తాము చిన్న పార్టీగా ఉంటూ చంద్రబాబు వద్ద ప్రాపకం కోసం ఎన్నాళ్ళు చేసినా ఇబ్బందిగానే ఉంటుందని జనసేన తలపోస్తోంది. మొత్తానికి పక్కా రాజకీయ వ్యూహంతోనే ఈ చేరికలను జనసేన ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు.
ఇక చూస్తే కనుక సామాజిక వర్గ సమీకరణలను జనసేన కాచి వడపోస్తోంది. కోస్తా జిల్లాలలో కాపుల సంఖ్య అధికంగా ఉంది. వారు అనేక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉన్నారు. దాంతో జనసేన గుంటూరు నుంచి ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం వరకూ ఉన్న కాపులను పోలరైజ్ చేసి జనసేన వైపుగా నడిపిస్తఒంది. ఇలా చేయడం వల్ల తాము కీలకమైన పార్టీగా ఏపీలో ఎదుగుతామని లెక్కలేస్తోంది.
అదే సమయంలో గ్రేటర్ రాయలసీమను కూడా పవన్ కళ్యాణ్ ఒక వైపు చూస్తూనే గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. రాయలసీమ నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కాపులు బలిజలుగా ఉన్నారు. అయితే వారు రాజకీయంగా అంత చైతన్యవంతంగా లేరు. దాంతో వారిని జనసేన వైపుగా ఆకట్టుకుంటే అక్కడ కూడా జనసేన బలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదన్నది పవన్ మార్క్ పొలిటికల్ థియరీగా ఉంది అంటున్నారు.
మొత్తం మీద చూస్తే పవన్ రాజకీయం చాలా దూరదృష్టితోనే ఉంది. ఆయన మెల్లగా ఏపీ రాజకీయాల్లో జనసేనను థర్డ్ ఫోర్స్ గా బలంగా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఆయన టీడీపీతో పొత్తులో ఉంటూ వైసీపీని దెబ్బతీయడం ద్వారా ఆ ప్లేస్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అంతవరకూ పొత్తులు ఉండాలని భావిస్తున్నారు.
అయితే టీడీపీకి జనసేన బలపడడం ఒక విధంగా ఇబ్బందికరమే అని అంటున్నారు. రెండు పార్టీల ఓటు బ్యాంక్ దాదాపుగా ఒక్కటే కావడంతో వైసీపీని బలహీనం చేసినా ఆ ప్లేస్ లో జనసేన ప్రత్యర్థిగా బలంగా మారడం టీడీపీ పెద్దలకు అంతగా ఇష్టం ఉండదనే అంటున్నారు. మొత్తం మీద జనసేన చేస్తున్న ఈ చాపకింద నీరు లాంటి పార్టీ బలోపేతం వ్యవహారం టీడీపీ వ్యూహాలను దాటి ఎంతవరకూ ముందుకు సాగుతుంది అన్నదే చూడాల్సి ఉంది.