Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లెవెల్ లో గ్యాప్...కూటమిలో హీట్ !

ఈ నేపథ్యంలో పై స్థాయిలో అయితే చంద్రబాబు పవన్ ల మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ బాగానే ఉంది అని అంటున్నారు. పవన్ చేసిన కామెంట్స్ పట్ల బాబు లోపల ఏమి అనుకున్నా బయటకు మాత్రం రియాక్టు కారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 March 2025 12:22 AM IST
గ్రౌండ్ లెవెల్ లో గ్యాప్...కూటమిలో హీట్ !
X

జనసేన ఆవిర్భావ సభ కాదు కానీ పచ్చగా ఉన్న కూటమిలో చిచ్చు పెట్టిందని అంతా అంటున్నారు. ఈ సభలో చెప్పాల్సిన విషయాలు చేయాల్సిన తీర్మానాలు జనసేన పార్టీ గురించి అయితే దానిని పక్కన పెట్టి మిత్రపక్షాలు అందునా కూటమికి పెద్దన్నగా ఉన్న టీడీపీ మీద అనవసరమైన కామెంట్స్ చేయడమేంటని తమ్ముళ్ళు అంటున్నారు.

ఈ సభలో పవన్ అయితే నాలుగు దశాబ్దాల టీడీపీని జనసేన నిలబెట్టిందని అనడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ అయితే ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఉన్న సన్నని గీతను సైతం చెరిపేశాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పై స్థాయిలో అయితే చంద్రబాబు పవన్ ల మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ బాగానే ఉంది అని అంటున్నారు. పవన్ చేసిన కామెంట్స్ పట్ల బాబు లోపల ఏమి అనుకున్నా బయటకు మాత్రం రియాక్టు కారని అంటున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల క్యాడర్ అయితే చీలిపోయింది. బాహాటంగానే పోస్టింగులతో సమరం చేస్తున్నారు.

నాలుగు దశాబ్దాల టీడీపీకి కార్యకర్తలే బలం అని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలలో టీడీపీ ఉందని జనసేనకు అంత బలం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమతో కలసినపుడే జనసేన గెలిచిందని గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని జైలులో పరామర్శించిన తరువాతనే కూటమి అన్న మాట వచ్చిందని దాని తరువాత ఒక ఊపు వచ్చిందని అది చివరికి అధికారం దిశగా సాగిందని జనసైనికులు బదులిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఒక చోదక శక్తిగా కూటమి వెనక ఉన్నారని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉందని కూడా వారు గుర్తు చేస్తూ అయినా తాము పొత్తుల విషయంలో త్యాగాలు చేశామని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి గెలిచిందని వారు అంటూంటే టీడీపీ బలంతోనే విజయం దక్కిందని ఎంతో అనుభవం కలిగిన బాబుని సీఎంగా చూడాలని జనాలు పరితపించారని అందువల్లనే గెలుపు దక్కిందని తమ్ముళ్ళు చెబుతున్నారు.

ఇలా సోషల్ మీడియాలో వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది అంతకంతకు పెరిగిపోతోంది. ఎంతలా అంటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వవద్దు అని ఒక కొత్త డిమాండ్ ని తమ్ముళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. నాగబాబు విషయంలో మొహమాటానికి పోతే కనుక చివరికి ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు పోస్టింగులు పెడుతున్నారు.

ఈ విధంగా చూస్తే గ్రౌండ్ లెవెల్ లో బిగ్ గ్యాప్ అయితే వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల పెద్దలు జోక్యం చేసుకుని సెట్ చేయాలని కోరుతున్నారు. నిజానికి చూస్తే టీడీపీకి జనసేనకు మధ్య ఉన్న అవగాహన వల్ల రెండు పార్టీలు లాభపడ్డాయని ఇది సమిష్టి విజయం అని అంటున్నారు. తమ ఒక్కరి వల్లనే అని ఎవరూ అనరాదని కానీ జనసేన పెద్దలే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి మాట్లాడడం వల్లనే ఇదంతా వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో ఈ వివాదాలకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో.