జనసేన Vs టీడీపీ: రగులుతున్న నామినేటెడ్ చిచ్చు.. !
నామినేటడ్ పదవులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి 20 పదవులను పంచారు.
By: Tupaki Desk | 26 Sep 2024 7:30 AM GMTనామినేటడ్ పదవులు ఇస్తున్నారు. ప్రస్తుతానికి 20 పదవులను పంచారు. అయితే.. ఈ వ్యవహారం క్షేత్రస్థా యిలో కూటమిలో కీలక పార్టీలైన టీడీపీ-జనసేనల మధ్య వివాదాలను రగిలిస్తున్నట్టు తెలుస్తోంది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కుమ్ములాటలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీనికి అప్పట్లోనే పార్టీలో విమర్శలు వచ్చాయి.
ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవడం ఏంటన్న చర్చ కూడా జరిగింది. అయితే.. అప్పట్లో పవన్ కల్యాణ్ దీనికి వేర్వేరు భాష్యాలు చెప్పుకొచ్చారు. ఏమీ లేని స్థాయి నుంచి ఎదుగుతున్నట్టు తెలిపారు. దీనికి సహకరించా లన్నారు. దీంతో అందరూ సర్దుకు పోయారు. టీడీపీ నుంచి నాయకులను తీసుకుని టికెట్లు ఇచ్చినప్పు డు కూడా అందరూ మౌనంగా ఉన్నారు. అయితే.. ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ విజయానికి పని చేశారు. ఇలాంటి వారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
తమకు 100 శాతం స్ట్రయిక్ రేట్ వచ్చిన నేపథ్యంలో నామినెటడ్ పదవుల్లో ఆ మేరకు కేటాయింపు ఉంటుందని ఆశించారు. దీనికి సంబంధించి కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు కూడా ఒక సందర్భంలో 18 నుంచి 20 శాతం వరకు పదవులను జనసేనకు ఇస్తామని ప్రకటించినట్టుగా ప్రచారం జరిగింది. మరో కూటమి పార్టీ బీజేపీకి 8 శాతం వరకు పదవులు ఇస్తామన్నారని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు పదవులు పంచిన తర్వాత.. ఈ శాతాలు ఎటు పోయాయన్నది ప్రశ్నగా మారి.. జనసేన నేతలకు-టీడీపీకి మధ్య దూరం పెరుగుతోంది.
ప్రస్తుతం 20 పదవులను మాత్రమే పంచారు. కానీ, వీటిలో జనసేనకు చాలా చాలా తక్కువ స్థానాలే దక్కా యి. దీనిని గమనిస్తే.. తమకు మరింత అన్యాయం చేస్తున్నారన్న వాదన జనసేనలో వినిపిస్తోంది. అధినేత పవన్ మాత్రం ఇచ్చింది చాలన్నట్టుగా ఉంటున్నారన్నది నాయకుల మాట. ఈ పరిణామాలతో క్షేత్ర స్థాయిలో పార్టీల మధ్య వివాదాలు.. విభేదాలు.. ఆధిపత్య రాజకీయాలకు బీజం పడుతోంది. ఇన్నాళ్లు జనసేనలో ఉన్నా.. తమకు ఎలాంటి గుర్తింపు లేదని భావిస్తున్న వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిని ఎలా సరిచేస్తారో చూడాలి.