వైసీపీకి స్పీడ్ బ్రేకర్లుగా జనసేన కాంగ్రెస్ ?
ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాం, వచ్చేసారికి తప్పకుండా గెలిచి తీరుతామని వైసీపీ నేతలు అయితే ధీమాగా ఉన్నారు.
By: Tupaki Desk | 8 July 2024 5:30 PM GMTఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాం, వచ్చేసారికి తప్పకుండా గెలిచి తీరుతామని వైసీపీ నేతలు అయితే ధీమాగా ఉన్నారు. కానీ ఏపీలో రాజకీయం చూస్తే మాత్రం వైసీపీకి ప్రతికూలంగానే ఉంది. అదే సమయంలో టీడీపీకి అనుకూలంగానూ ఉంది. ఈసారి ఎన్నికల్లో 135 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. ఆ పాటీ పుట్టాక గెలవని అనేక సీట్లను ఈసారి గెలుచుకోవడం విశేషం.
ఇక అయిదేళ్ల పాటు చేతిలో ఉన్న అధికారంతో టీడీపీ మరింత బలపడుతుంది. ఆ పార్టీకి లోకేష్ రూపంలో భవిష్యత్తు నాయకుడు కూడా ఉన్నారు. టీడీపీ మరిన్ని సార్లు నిలిచి గెలిచే ధీమాను ఈసారి ఎన్నికలతో సంపాదించుకుంది.
మరో వైపు చూస్తే ఈ రోజుకు టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఆ పార్టీలు వేరుగా మారినా ఎదురు నిలిచి పోటీ చేసినా రాజకీయంగా నష్టం అయితే వైసీపీకే అని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం మీద వచ్చే యాంటీ ఇంకెంబెన్సీని విపక్షాలు అలా చీల్చుకుంటే నష్టపోయేది వైసీపీయే అని చెప్పక తప్పదు.
ఎన్నికలకు ముందు జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక తప్పకుండా జరుగుతుంది. అది వైసీపీని అధికారం నుంచి దూరం పెట్టే లాగానే ఉంటుంది అని అంటున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండే ముఖ చిత్రం అయితే జాతీయ స్థాయిలో మొత్తం మారుతోంది.
కాంగ్రెస్ బాగా ఎదుగుతోంది. ఇండియా కూటమి సైతం విస్తరిస్తోంది. ఈ ఎన్నికల్లో తృటిలో తప్పిన అధికారం 2029 నాటికి కచ్చితంగా దక్కే చాన్స్ అయితే ఉంటుంది. 2024 ఎన్నికల్లోనే బీజేపీకి సొంతంగా మెజారిటీని జనాలు ఇవ్వలేదు. పైగా యూపీలో భారీ రాజకీయ మార్పులు సంభవిస్తున్నాయి. ఉత్తరాదిలో కమలానికి వ్యతిరేక పవనాలు వీస్తే కనుక అది కాంగ్రెస్ కే అది పెద్ద అడ్వాంటేజ్ గా మారుతుంది.
అలా చూసుకుంటే 2029 నాటికి దేశమంతా ఇండియా కూటమి అనుకూల ప్రభంజనం వీస్తే అందులో ఏపీ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. పూర్తి స్థాయిలో గెలవకపోయినా గణనీయంగా ఏపీలో కాంగ్రెస్ లాభపడినా అది వైసీపీ రాజకీయ అదృష్టాన్ని పూర్తిగా చెరిపివేస్తుందని అంటున్నారు.
ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ ని తిరిగి సాధించినప్పుడే కాంగ్రెస్ ఏపీలో వికసిస్తుంది. అలా జాతీయ స్థాయి పరిణామాలు ఏపీ మీద ప్రసరిస్తే వైసీపీలోనే రాజకీయ ప్రకంపనలు పుట్టడం ఖాయం. ఇలా కాంగ్రెస్ కూటమి అంటే వామపక్షాలు ప్లస్ కాంగ్రెస్ ఒక వైపు పోటీలో ఉంటే మరో వైపు బీజేపీ జనసేన పోటీ చేస్తే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగితే టోటల్ గా టీడీపీకే 2029 ఎన్నికల్లోనూ భారీ అడ్వాంటేజ్ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
అలా కాదు అని బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసి ఇండియా కూటమి వైసీపీ వేరు వేరుగా పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలి అపుడు కూడా టీడీపీ కూటమికే లబ్ధి కలుగుతుంది. సో ఏపీలో ఎవరు బలపడాలని చూసినా ఎవరు వేరుగా వెళ్ళి పోటీ చేసినా అది చివరికి వైసీపీకే దెబ్బ తప్ప టీడీపీకి కాదు అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణ.
అందువల్లనే టీడీపీ బే ఫికర్ గా ఉంటోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలీ అంటే వేయి సవాళ్ళను దాటుకుని రావాలి. జగన్ తప్ప మరొకరిని చూడమన్న విపరీతమైన ఆరాధనా భావం జనం గుండెల్లో రావాలి. ఆ విధంగా జరుగుతుందా అంటే అయిదేళ్ల నిండు కాలం ముందర ఉంది. వెయిట్ అండ్ సీ.