కొత్త మాట: సీఎం పదవిపై పవన్ అలా.. బాబు ఇలా!
రోజులు గడిచే కొద్దీ.. ఏపీలో ఎన్నికల వాతావరణం అంతకంతకూ ముదురుతోంది. అదే సమయంలో అధినేతల మాటలు సైతం మారుతున్నాయి.
By: Tupaki Desk | 19 Aug 2023 4:25 AM GMTఅధికారమే తప్పించి.. మరింకేమీ ముఖ్యం కాదన్న అధినేతలు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీఎం జగన్ ఓటమే తమకు ముఖ్యమన్న విషయాన్ని చెప్పేస్తూ.. తమను గెలిపించాలని కోరుతున్న టీడీపీ.. జనసేన అధినేతల స్వరంలో మార్పులు మొదలయ్యాయి. ప్రత్యర్థులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తూ.. తమ లక్ష్యాన్ని చేరుకోవాలన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.
అందుకు తగ్గట్లుగా టీడీపీ.. జనసేన చీఫ్ నోటి నుంచి వస్తున్న కొత్త మాటలు వారి వ్యూహాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెప్పాలి. ఇంతకాలం ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తి లేదన్న జనసేన అధినేత పవన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సీఎం పదవిని చేపట్టే అనుభవం తనకింకా రాలేదన్న ఆయన.. ఇప్పుడు మాత్రం పదేళ్లుగా తనను తాను ఫ్రూవ్ చేసుకున్నానని.. ఏపీ పట్ల తనకున్న కమిట్ మెంట్ ను చూపించిన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవికి అర్హత సాధించినట్లేనన్న మాటలు మాట్లాడుతున్నారు.
సీఎం పదవిని తాను బలంగా ఆశిస్తున్న విషయాన్ని ఆయన చెప్పటం తెలిసిందే. ఏపీలోని మొత్తం స్థానాల్ని పక్కన పెట్టి.. కనీసం యాభై స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్న జనసేన.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే విషయంలో ఆ పార్టీ చీఫ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో చంద్రబాబు నోటి నుంచి కొత్త తరహా వ్యాఖ్యలు వస్తున్నాయి.
తాను పద్నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని.. తనకు సీఎం పదవి కొత్తేం కాదని.. తనకు సీఎం పదవి కంటే కూడా ఏపీ ప్రజల భవిష్యత్తు మాత్రమే ముఖ్యమంటూ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వ్యూహానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవి మీద ఆసక్తి లేదన్న పవన్ నోటి నుంచి తానే సీఎం అన్న మాట స్పష్టంగా చెప్పేస్తుంటే.. మరోవైపు తాను మరోసారి ముఖ్యమంత్రిని అవుతానని.. ఇవే తనకు చివరి ఎన్నికలు అంటున్న చంద్రబాబు.. ఇప్పుడు తనకు సీఎం పదవి అక్కర్లేదని.. తనకు ఆశ లేదన్న మాట చెప్పటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది.
తమ బంధాన్ని బలోపేతం చేసుకోవటంతో పాటు.. పవన్ ను గెలిపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్న ఒక వర్గం గుర్రును తగ్గించే పనిలో భాగంగా ఈ తరహా మాటలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. అధికార వైసీపిని గందరగోళానికి గురి చేసే పనిలో భాగంగా తాజా వ్యాఖ్యలు షురూ అయ్యాయని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే టీడీపీ.. జనసేన అధినేతల నోట మాటల్లో మార్పు వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రాజకీయ వాతావరణానికి అనుకూలంగా తమ వ్యూహాల్ని మార్చుకునే విషయంలో విపక్షాలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు.