ఎమ్మెల్యే ముందే టీడీపీ, జనసేన నేతల ఫైట్!!
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2024 9:55 AM GMTఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఫలితంగా... టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అటు టీడీపీ మంత్రులు, ఇటు జనసేన మంత్రులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కూటమి నాలుగు కాలాలపాటు క్షేమంగా ఉండేలా పాలనతో ప్రయత్నిస్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... నాయకులు ఇద్దరూ ఎంతగా ఫిక్సయ్యి, ఐకమత్యంతో కూటమి నాలుగు కాలాల పాటు క్షేమంగా ఉండాలని ప్రయత్నాలు చేసినా... అందుకు క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒక అండర్ స్టాండింగ్ తో ముందుకు పోవడం అతి ముఖ్యం. గతంలో ఇరు పార్టీల ఓట్లూ ట్రాన్స్ ఫర్ అవ్వబట్టే కూటమికి ఈ స్థాయి గెలుపు లభించింది. అలా కానిపక్షంలో 2019 రిపీట్ అయ్యి ఉండేదని అంటారు!
అయితే ఎన్నికలకు ముందు టీడీపీ - జనసేన కార్యకర్తలు, నాయకుల మధ్య అక్కడక్కడా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అది ప్రధానంగా ఎవరికి టిక్కెట్ దక్కుతుందనే విషయంపై జరిగినట్లు చెబుతారు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి.. కూటమి అధికారంలోకి వచ్చింది.. ఈ సమయంలో ఆధిపత్య ధోరణిలో భాగమో ఏమో కానీ... టీడీపీ - జనసేన నేతల మధ్య కొట్లాటలు కంటిన్యూ అవుతుండటం గమనార్హం.
అవును... తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే జరిగింది. పి.గన్నవరంలో తాజాగా నిర్వహించిన ఓ సభలో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో, జనసేన నాయకులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమయంలో వేదికపై ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయంపై వాగ్వాదం చెలరేగినట్లు తెలుస్తుంది!
ఇందులో భాగంగా... ఆ సభలో టీడీపీ - జనసేన నేతలు కార్యకర్తల మధ్య ఈ విషయంలోనే మాటా మాటా పెరిగిందని అంటున్నారు. అనంతరం మాటలు పెరిగి నెట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్లిందని సమాచారం. దీంతో... ఇరు పార్టీల నేతలూ ఇలా ఎమ్మెల్యే ముందే ఇలా రచ్చ చేయడంతో.. ముందు ముందు పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది!