మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన!
కాగా ఇప్పుడు చివరి క్షణంలో బీజేపీ కూడా కూటమిలో చేరడంతో జనసేనకు ఇచ్చే స్థానాలు తగ్గిపోతాయని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 11 March 2024 7:56 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా ఇప్పుడు చివరి క్షణంలో బీజేపీ కూడా కూటమిలో చేరడంతో జనసేనకు ఇచ్చే స్థానాలు తగ్గిపోతాయని టాక్ నడుస్తోంది.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. జనసేనలో ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్న కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి బరిలోకి దింపుతున్నారు. 2019 ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 42 వేలకు పైగా ఓట్లను సాధించారు.
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా దుర్గేష్ కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్ లోనే పోటీ చేయడానికి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు.
గత ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరికీ టీడీపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ సీటుపైన పీటముడి నెలకొంది. ఈ సీటును జనసేనకు ఇవ్వడానికి గోరంట్ల నిరాకరించడం, మరోవైపు జనసేన శ్రేణులు భీష్మించుకు కూర్చోవడంతో ఎవరికి ఈ సీటును కేటాయిస్తారో తెలియలేదు. చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత జాబితాలోనూ రాజమండ్రి రూరల్ సీటును హోల్డ్ లో పెట్టారు.
ఇప్పుడు అనేక తర్జనభర్జనల అనంతరం నిడదవోలు సీటును జనసేన తీసుకోవాలని నిర్ణయించింది. ఆ సీటులో కందుల దుర్గేష్ పోటీ చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున ఆశిస్తున్నారు. ఆయన గతంలో పలు పర్యాయాలు అక్కడ నుంచి గెలుపొందారు. అయితే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో నిడదవోలు నుంచి జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కందుల దుర్గేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బూరుగుపల్లి శేషారావుకు నిరాశే ఎదురైంది.