జనసేన సీట్లు ఫైనలయ్యాయా ?
అందుకనే మధ్యేమార్గంగా జనసేనకు 11 నియోజకవర్గాలను కేటాయించాలని అందులో కూకట్ పల్లిని వదులుకోవటానికి కూడా బీజేపీ రెడీ అయ్యిందని పార్టీవర్గాలు చెప్పాయి.
By: Tupaki Desk | 1 Nov 2023 6:56 AM GMTతెలంగాణా ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందా ? జనసేనకు ఇవ్వబోయే సీట్ల సంఖ్యను, నియోజకవర్గాలను బీజేపీ అగ్రనాయకత్వం ఫైనల్ చేసిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొత్తంమీద జనసేనకు 11 సీట్లు ఇవ్వటానికి బీజేపీ డిసైడ్ చేసిందని సమాచారం. అసలైతే సొంతంగా పోటీచేయటానికి ఒకపుడు జనసేన నిర్ణయించింది. 32 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఎవరితోను పొత్తులేకుండానే పోటీలోకి దిగాలని అనుకున్నది.
అయితే తర్వాత ఏమైందో ఏమో రెండుపార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. దాంతో సీట్ల షేరింగ్ సమస్యగా మారింది. తాము ప్రకటించిన 32 నియోజకవర్గాలు కాకపోయినా 20 సీట్లను ఇచ్చితీరాల్సిందే అని జనసేన పట్టుపట్టింది. ఇదే సమయంలో 6-8 నియోజకవర్గాలను మాత్రమే బీజేపీ ఆఫర్ చేసింది. దీంతో రెండుపార్టీల మధ్య వివాదం మొదలైంది. నియోజకవర్గాల సంఖ్యే కాకుండా రెండుపార్టీలు పోటీచేయాలని అనుకుంటున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల విషయంలో కూడా రెండుపార్టీల మధ్య బాగా గొడవలవుతున్నాయి.
అందుకనే మధ్యేమార్గంగా జనసేనకు 11 నియోజకవర్గాలను కేటాయించాలని అందులో కూకట్ పల్లిని వదులుకోవటానికి కూడా బీజేపీ రెడీ అయ్యిందని పార్టీవర్గాలు చెప్పాయి. సీమాంధ్రులు ఎక్కువగా ఉంటున్నారన్న కారణంగానే పై మూడు నియోజకవర్గాల విషయంలో జనసేన పట్టుబడుతోంది. అందుకనే మూడు నియోజకవర్గాల్లో కూకట్ పల్లిని కేటాయించేందుకు సిద్ధపడింది. అలాగే మిగిలిన నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నట్లు కమలనాదులు చెబుతున్నారు. ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలైతే జనసేనకు బాగా వర్కవుటవుతుందని బీజేపీ పెద్దలు అనుకున్నారట.
తెలంగాణా బీజేపీ తాజా ప్రతిపాదనపై ఢిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటి కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఇటలీలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగిరాగానే ఇదే విషయాన్ని చర్చించి అధికారికంగా ఒక ప్రకటన చేయాలని బీజేపీ నేతలు రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని జనసేన తెలంగాణా ఇన్చార్జిలతో కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తంమీద గొడవల మధ్య రెండుపార్టీలు పోటీచేయబోయే సీట్ల సర్దుబాటు అవుతున్నట్లుంది.