రెండు సీట్లను ప్రకటించిన పవన్... బాబుపై సంచలన వ్యాఖ్యలు!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది
By: Tupaki Desk | 26 Jan 2024 6:17 AM GMTఅసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పుల విషయం ఒక చర్చనీయాంశం అయితే... పార్టీలు మారుతున్న నేతల విషయం మరో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సమయంలో రిపబ్లిక్ డే రోజున "ఆర్" అనే అక్షరంతో ఉన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అవును... వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు, కనీసం 50 - 60కి తగ్గకుండా తీసుకోవాలని పవన్ పై జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేయోభిలాషులు, కాపు సామాజికవర్గ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.
ఈ సమయంలో ఊహించని రీతిగా పవన్ కల్యాణ్.. రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మండపేట, అరుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని.. కానీ వారు అభ్యర్థులను ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒత్తిడి చంద్రబాబుకే కాదు తనకు కూడా ఉంటుందని చెబుతూ... కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిపబ్లిక్ డే రోజున తాను కూడా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు కల్యాణ్. ఇందులో భాగంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా... కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు.. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం.. ఒక మాట అటున్నా, ఇటున్నా కలిసే వెళ్తున్నాం అని అన్నారు. ఇదే సమయంలో... "టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది.. ఈ పొత్తు ధర్మం కాదు.. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది.. దీనిపై పార్టీ నేతలకు నా క్షమాపణలు" అని అన్నారు పవన్.
ఇక పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలనేది తనకు తెలియనిది కాదని చెప్పిన పవన్... ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయిగానీ అధికారంలోకి వస్తామోరామో తెలియదని అన్నారు. ఈ క్రమంలో చాలా మంది... పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారని చెప్పిన ఆయన... తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను? అని ప్రశ్నించారు. "ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక.. అందుకే నాకు నిర్మించడం ఇష్టం" అని అన్నారు.
ఇదే సమయంలో రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని తెలిపిన పవన్ కల్యాణ్... టీడీపీతో పొత్తు అసెంబ్లీ ఎన్నికలతోనే ఆగిపోవడం లేదని, ఎమ్మెల్యే టిక్కెట్లకే పరిమితం కావడం లేదని, భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే... లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని.. రాష్ట్ర ప్రయోజనాలకోసం మౌనంగా ఉన్నానని పవన్ చెప్పుకొచ్చారు.
కాగా... జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... అరకు అభ్యర్థిని కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో... పొత్తులో ఉన్నప్పుడు ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రకటించడం పవన్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు.