Begin typing your search above and press return to search.

జనసేనకి బీపీ పెరిగిపోతోందా... బాబు ఏం చేయబోతున్నారు....!?

మిత్రపక్షం జనసేనకు బీపీ పెంచే విధంగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తోందా అన్నది ఇపుడు కీలక చర్చగా ఉంది. నిజానికి మూడు నెలల క్రితమే ఓపెన్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు అని ప్రకటించేశారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 1:30 AM GMT
జనసేనకి బీపీ పెరిగిపోతోందా... బాబు ఏం చేయబోతున్నారు....!?
X

మిత్రపక్షం జనసేనకు బీపీ పెంచే విధంగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తోందా అన్నది ఇపుడు కీలక చర్చగా ఉంది. నిజానికి మూడు నెలల క్రితమే ఓపెన్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు అని ప్రకటించేశారు. ఆ తరువాత చూస్తే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి కూడా యాభై రోజులు దగ్గర అవుతోంది. కానీ జనసేన సీట్లు ఏవీ తేలడంలేదు.

ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబుతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ జనసేన సీట్ల గురించి ప్రస్తావించారని ప్రచారం అయితే సాగింది. అయితే బాబు మదిలో ఏముందో తెలియడం లేదు అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు పొత్తు టికెట్లు ఇపుడే ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని రెండు పార్టీలలో ఆశావహులలో అసంతృప్తులు రేగి రచ్చగా మారుతుందని ఆలోచిస్తున్నారు అంటున్నారు.

అందువల్ల ముందుగా ఆత్మీయ సమ్మేళనాలు అంటూ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించేలా చూశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేషన్ మీటింగ్స్ అని కూడా పెట్టారు. ఇక ఇపుడు పవన్ చంద్రబాబు కలసి మరిన్ని మీటింగ్స్ కి హాజరు కాబోతున్నారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో జరిగే సభకు పవన్ చంద్రబాబు హాజరవుతున్నారు.

ఇక మీదట ఈ విధంగా కొన్ని సభలకు ఇద్దరూ అటెండ్ అవడం ద్వారా రెండు పార్టీలలో సామరస్య వాతావరణం తీసుకుని రావాలని చూస్తున్నారుట. అయితే ఇటీవల టీడీపీ జనసేనలో జరుగుతున్న అలజడిని గమనిస్తోంది అని అంటున్నారు. పవన్ సీఎం కావాలని క్యాడర్ బలంగా కోరుకుంటోంది. దానికి జనసేన నాయకత్వం వారిని ఏ విధంగానూ సంతృప్తి పరచ లేకపోతోంది అని కూడా అంటున్నారు.

మరో వైపు టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తరువాత జనసేనలో జోష్ తగ్గిందని కూడా టీడీపీ గమనిస్తోంది అని అంటున్నారు. విశాఖలో పవన్ సభకు జనాలు తక్కువగా హాజరు కావడాన్ని కూడా టీడీపీ విశ్లేషించుకుంటోందని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన నలభై నుంచి యాభై దాకా సీట్లు కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

కానీ తెలంగాణాలో పోటీ చేసిన ఎనిమిది సీట్లలో జనసేనకు డిపాజిట్లు దక్కలేదని కూడా టీడీపీలో చర్చ సాగుతోంది అని ప్రచారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అంటే చూడాలనే అంటున్నారు. అవి ఇరవై నుంచి పాతిక దాకా ఇస్తారా లేక ఇరవై లోపు ఇస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది.

మరి ఇంత తక్కువ సీట్లు ఇస్తే జనసేన క్యాడర్ సహకరిస్తుందా అంటే అలాంటి అనుమానాలు టీడీపీలో ఉండబట్టే సీట్లను ఇచ్చే విషయంలో కొంత ఆచీ తూచీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి ఎంత మేరకు టర్న్ అవుతాయన్న దాని మీద కూడా టీడీపీ అధ్యయనం చేస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే రెండు విధాలుగా టీడీపీకి ఇబ్బంది అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోందిట. అదెలా అంటే టీడీపీలో ఆ మేరకు అసంతృప్తులు పెరిగిపోతాయని, ఇక జనసేనకు ఇచ్చే సీట్లలో గట్టి పోటీ ఇవ్వకపోతే వైసీపీకి ఆయాచితంగా ఆ సీట్లు ఇచ్చిన వారమవుతామని కూడా టీడీపీలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.

ఇదంతా ఎందుకు వస్తోంది అంటే జనసేనలో ఇపుడు ఒక రకమైన గందరగోళం ఏర్పడడం వల్లనే అంటున్నారు. జనసేన క్యాడర్ పవన్ సీఎం అన్న ప్రకటన లేకపోయినా సీట్లు తగ్గినా కూడా కాడె వదిలేస్తారా అన్న భయాలు ఉన్నాయట. దాంతోనే అన్నీ విశ్లేషించుకుని మరీ జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్నది టీడీపీ ఒక డెసిషన్ తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే టీడీపీలో జరుగుతున్న ఈ చర్చ కానీ విశ్లేషణ కానీ జనసేనకు బీపీ పెంచడమే కాదు కొత్త అనుమానాలకు కూడా కారణం అవుతున్నాయట. తమకు సీట్లు తగ్గినా లేక కావాల్సిన చోట్ల సీట్లు తెచ్చుకోలేకపోయినా ఈ పొత్తు ప్రయోగం ఇబ్బంది అవుతుందని కూడా గాజు గ్లాస్ పార్టీలో ఆలోచనలు సాగుతున్నాయట. మొత్తానికి టీడీపీ పొత్తు పార్టీ విషయంలో అనేక రకాలుగా మధనం చేస్తోంది అని అంటున్నారు. దానికి కారణం ఈసారి ప్రతీ ఒక్క సీటూ ఇంపార్టెంట్ కావడం. అంతే కాదు పొత్తు పేరిట సీట్లు ఎక్కువ ఇచ్చి చేతులు కాల్చుకోకూడదు అన్న సూచనలు కూడా ఉండడం అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలలో నిజమెంత ఉందో.