Begin typing your search above and press return to search.

ఈ మాటలకు అర్థమేంటి పవన్ జీ...?

తెలంగాణా తనకు ఆత్మ అన్నారు విభజన తరువాత ఏపీ బాగుపడితే తెలంగాణాలో యువతకు ఉద్యోగాలకు ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Aug 2023 12:40 PM GMT
ఈ మాటలకు అర్థమేంటి పవన్ జీ...?
X

పవన్ కళ్యాణ్ ఏపీ బాగుపడితే తెలంగాణాలో ఉద్యోగాల కోసం ఎవరూ వెళ్లరని అంటున్నారు. ఏపీ నుంచి తెలంగాణాకు యువత ఉద్యోగాలకు వెళ్లడం వల్ల అక్కడ యువతకు ఇబ్బంది కలుగుతోంది అని అంటున్నారు. ఈ మాటను పవన్ ఇంతకు ముందు అంటే నెల క్రితం కూడా ఇదే మంగళగిరిలో పార్టీ నాయకులతో మాట్లాడుతూ అన్నారు.

ఇపుడు మరోసారి ఆయన మాట్లాడారు. తెలంగాణా తనకు ఆత్మ అన్నారు విభజన తరువాత ఏపీ బాగుపడితే తెలంగాణాలో యువతకు ఉద్యోగాలకు ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. దీని భావమేమి పవన్ జీ అని ఇపుడు ఏపీ నుంచి విజ్ఞత కలిగిన వారు అంతా అడుగుతున్నారు. అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే అక్కడే యువత అంతా కట్టకట్టుకుని ఉండిపోతారా మెరుగైన ఉద్యోగాల కోసం వేరే చోట్లకు వెళ్లరా అన్నది ఒక డౌట్.

అదే విధంగా ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారంతా తమ ప్రాంతం ఉపాధికి ఏమీ లేదని భావించి వెళ్లి ఉంటారనుకోవాలా అన్నది మరొక డౌట్. ఆ మాటకు వస్తే తెలంగాణాలోని హైదరాబాద్ కి ఒక్క ఏపీ నుంచే కాదు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి యువత ఉపాధి కోసం వస్తున్నారు. మరి అక్కడ ఏపీ మాదిరిగా విభజన జరగలేదు కదా. ఆయా రాష్ట్రాలు బాగానే ఉన్నాయి కదా.

ఆర్ధిక సంస్కరణలు ప్రపంచీకరణ నేపధ్యంలో మానవ వనరులు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉపయోగించుకునే సదుపాయం వచ్చింది. అంతే కాదు అవసరం అనుకుంటే ఇతర దేశాల నుంచి కూడా మానవ వనరులను వాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే అమెరికాలో ఎన్ని దేశాల వారు పనిచేయడంలేదు, మరి ఆయా దేశాలు ఏమైనా వెనకబడిపోయాయని భావించాలా.

అంతే కాదు ఇదే తెలంగాణా నుంచి అమెరికాలో ఉద్యోగాల కోసం యువత వెళ్తోంది. వారి సంగతేంటి, అంటే తెలంగాణా ఉపాధి కేంద్రం కాదనుకుని వెళ్తున్నారా. అంతే కాదు బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి చోట్ల దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అంతా పనిచేస్తున్నారు.

మరి అలాంటి వారంతా తమ మీద ఇతర రాష్ట్రాల నుంచి వత్తిడి వచ్చి లోకల్ గా ఉపాధి పోతుందని అనుకుంటారా. పవన్ వాదన వింతగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందలేదు, ఉపాధి అవకాశాలు లభించడంలేదు అని ఆయన విమర్శలు చేసే చేయవచ్చు. కానీ తెలంగాణా యువత ఇబ్బంది పడుతున్నారంటూ కొత్త వాదన వినిపించడం ద్వారా లేని పోని కొత్త వివాదాలకు తెర తీసే ప్రయత్నం చేస్తున్నారా అన్నదే మేధావుల నుంచి అందరికీ కలుగుతున్న డౌట్.

ఇక ఈ రోజుకీ హైదరాబాద్ ఏపీ తెలంగాణాకు ఉమ్మడి రాజధాని. 2024 జూన్ 2 వరకూ అది కొనసాగుతుంది. కేంద్రం తలచుకుంటే మరో అయిదేళ్లు కూడా ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ ఉంటుంది. అలాంటిది పవన్ ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్లి యువత ఉద్యోగాలు చేయడం మీద ఆక్షేపణ పెట్టడం వింతగా విడ్డూరంగా ఉంది అని అంటున్నారు.

నిజానికి తెలంగాణాలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ విధంగా మాట్లాడడం లేదు, నా నిధులు మా ఉద్యోగాలు, మా నియమాకాలు ఏపీ యువత తీసుకుంటోంది అని వారు అనడమే లేదు. మరి ఏపీకి చెందిన పవన్ అలా అనడమేంటి అన్నదే ప్రశ్నగా ఉంది. తెలంగాణా ఆత్మ అని అంటున్న పవన్ అక్కడే రాజకీయాలు చేసుకోవచ్చు కదా అన్న సూచనలు కూడా వస్తున్నాయి.

మొత్తానికి అపరిపక్వత అవగాహన లేమితో చేసే కొన్ని కామెంట్స్ చివరికి ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయో ఉమ్మడి ఏపీ రెండుగా విభజన కావడాన్ని అంతా చూసారు. ఇపుడు అలాంటి వాతావరణం కాకుండా రాకుండా చూసుకోవాలి. రేపటి రోజున ఏపీ అభివృద్ధి ఎంతగా చెందినా ఏపీ యువత హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తారు, అది వారి ఇష్టం, ఆ అవకాశం కూడా ఉంది.

ఆ మాటకు వస్తే ఏపీ నుంచి వెళ్ళిన వారే అక్కడ పరిశ్రమలు కూడా పెట్టి ఉన్నారు. వాస్తవాలు అసలు విషయాలు మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఎవరికీ తగదు. పవన్ తరచూ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు అర్ధమేంటో ఆయన గానీ జనసేన కీలక నాయకులు కానీ చెబితే బాగుంటుంది అని అంటున్నారు. ఉమ్మడి ఏపీ రెండుగా మారినా అక్కడా ఇక్కడా కూడా అంతా ఒక్కటిగా ఉంటారు, ఎక్కడ ఎవరైనా ఉపాధి పొందవచ్చు. ఈ విషయంలో రెండవ మాటే లేదు అన్నదే జనం నుంచి వస్తున్న నినాదంగా ఉంది మరి.