సికింద్రాబాద్ లో బీజేపీకి జనసేన హ్యాండిస్తుందా ?
కానీ తెలంగాణలోని సికింద్రాబాద్ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బీజేపీకి సహకరించడం లేదని, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని సమాచారం.
By: Tupaki Desk | 21 April 2024 11:58 AM GMTఏపీలో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు కష్టపడ్డారు. కేవలం 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితమై ఎన్నికల్లో పోటీకి దిగారు. కానీ తెలంగాణలోని సికింద్రాబాద్ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బీజేపీకి సహకరించడం లేదని, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని సమాచారం.
మెట్రోపాలిటన్ నగరం అయిన హైదరాబాద్ లో సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానుల సంఖ్య ప్రభావం చూపే రీతిలో ఉంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆంధ్రా నుండి వచ్చి సెటిలైన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్తల మౌనం బీజేపీకి ఇబ్బందికరమే.
సికింద్రాబాద్ స్థానం నుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నాడు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ సొంతంగా అభ్యర్థిని నిలిపింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న ఎన్.శంకర్‌గౌడ్ గత ఎన్నికల బరిలో నిలవగా ఆయనకు 9,683ఓట్లు వచ్చాయి.
సికింద్రాబాద్ ఎన్నికలలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యన త్రిముఖపోటీ నెలకొన్నది. అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రతి ఓటూ కీలకమే. అందుకే బీజేపీ, జనసేన అధిష్టానాలు చొరవ తీసుకుని రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసి ప్రచారంలో ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నారు. జనసేనను విస్మరిస్తే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.