కృష్ణా గడ్డపై జనసేన జెండా పట్టేదెవరు.. కట్టేదెవరు?
అయితే.. ఇలాంటి పార్టీలను నిలబెట్టేది నాయకులే కదా?! ఇప్పుడు ఈ నాయకత్వమే జనసేనకు ఇబ్బందిగా మారింది
By: Tupaki Desk | 10 April 2024 12:30 AM GMTకొన్ని కొన్ని పార్టీలకు నాయకుల బలం కన్నా కేడర్ బలం ఎక్కువగా ఉంటుంది. నాయకులు పోయినా.. నాయకులను తయా రు చేసుకుంటాం అని టీడీపీ వంటి సీనియర్ పార్టీలు చెప్పే మాట వెనుక అంతరార్థం ఇదే. కానీ, కేడర్ బలం పెద్దగా లేని జనసేన వంటి పార్టీలు కూడా ఇదే పంథా అనుసరిస్తే.. కుదురుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ``ఏంటి మాట్లాడేది`` అని అనుకున్నారో.. బుజ్జగించి మాత్రం ఏం చేస్తాం అని భావించారో.. తెలియదు కానీ.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్లు దక్కని నాయకులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పన్నెత్తు పరామర్శ కూడా చేయలేదు. రండి మాట్లాడుకుందాం! అని కూడా చెప్పలేదు.
ఈ ఎఫెక్ట్ కీలకమైన రాజధాని జిల్లాగా పేరొందిన కృష్ణాపైనే ఎక్కువగా పడుతోంది. ఈ జిల్లా భిన్నమైన రాజకీయాలకు ఆలవా లం. ఒక్కసారి నమ్మారా.. జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 10కి పైగా ఉన్నాయి. ఇక్కడ పార్టీలే ప్రామాణికం. నాయకుల కన్నా.. పార్టీలకే ప్రజలు పట్టం కడుతుంటారు. అయితే.. ఇలాంటి పార్టీలను నిలబెట్టేది నాయకులే కదా?! ఇప్పుడు ఈ నాయకత్వమే జనసేనకు ఇబ్బందిగా మారింది. విజయవాడ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పోతిన మహేష్.. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. ఇస్తామని పవన్ కూడా చెప్పారు. తీరా ఏం జరిగిందో ఏమో.. ఆయనకు టికెట్ తో పాటు స్వాంతన, ఓదార్పు కూడా దక్కలేదు.
ఫలితంగా పోతిన మహేష్.. రాళ్లేసి.. రయ్యమన్నారు. రేపో మాపో ఆయన వైసీపీకి జై కొట్టనున్నారు. ఇక, విజయవాడలోనే మరో కీలక నేత ఉన్నాడు. ఈయన పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. కాపు నాయకుడిగా గుర్తింపు పొందిన సోడిశెట్టి రాధా అని యువ నాయకుడు. ఈయన కూడా వ్యాపార వేత్త. అయితే.. ఈయనకు కూడా పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది . దీంతో ఆయన కూడా పోతిన వెంటే పరుగులు పెడుతూ.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఫలితంగా నిన్న మొన్నటి వరకు జనసేనకు బెజవాడలో జెండాలు కట్టిన నాయకులు ఇప్పుడు దూరమయ్యారు.
ఇక, ఉమ్మడి కృష్ణాలోని అవనిగడ్డలో విక్కుర్తి శ్రీనివాస్ టికెట్ ఆశించారు. ఆయనకు కూడా పార్టీ ఇవ్వలేదు. పైగా టీడీపీ నుంచి తీసుకువచ్చిన మండలి బుద్ద ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో విక్కుర్తి కూడా పక్క చూపులు చూస్తున్నారు. దీనిని వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకుంది. మరోవైపు కైకలూరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తానని చెప్పిన బీవీ రావు.. అధినేత పర్యటనలకు బాగానే ఖర్చు పెట్టారు. అయితే.. ఈ టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేశారు. ఫలితంగా పార్టీని ముందుండి నడిపిన బీవీ రావు.. తాజాగా జనసేనకు రాజీనామా చేశారు. మొత్తంగా చూస్తే.. కాపు సామాజిక వర్గంలోనే చాలా మంది నాయకులు.. దూరంగా ఉన్నారు. కొందరు దూరమయ్యారు. ఫలితంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణాలో జనసేనలో పుట్టి, పెరిగిన నాయకులు అంతర్థానం అయ్యారు. మరి రేపు జెండాలు ఎవరు కట్టాలి? అనేది ప్రశ్న.