టీడీపీతో పవన్ కలిసింది అందుకోసమేనా ?
పైగా ప్రచారం కూడా అతి ముఖ్యమైన ఈ రోజులలో పార్టీ వాయిస్ ఇటు క్యాడర్ కి అటు జనాలకు కూడా వెళ్లదు.
By: Tupaki Desk | 2 May 2024 3:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వరకూ చూస్తే రాజకీయంగా సరైన నిర్ణయమే తీసుకున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ హోరా హోరీ ఏపీ రాజకీయ సమరంలో జనసేన ఒక చిన్న పార్టీ ప్రచారానికి దూరంగా ఉండిపోయేది అన్న విశ్లేషణలు ఉన్నాయి. దానికి 2019 ఎన్నికలనే తార్కాణంగా చూపిస్తున్నారు. టీడీపీని విభేదిస్తే అనుకూల మీడియా సపోర్ట్ దక్కదు. పైగా ప్రచారం కూడా అతి ముఖ్యమైన ఈ రోజులలో పార్టీ వాయిస్ ఇటు క్యాడర్ కి అటు జనాలకు కూడా వెళ్లదు.
ఇక ఎన్నికల్లో పోటీ అంటే భారీ బడ్జెట్ తో కూడుకున్న అంశం. దాంతో జనసేన ఈసారి టీడీపీతో జత కట్టింది. పొత్తులో భాగంగా సీట్లు ఎక్కువ తీసుకుందా తక్కువ తీసుకుందా అన్నది పక్కన పెడితే జనసేనకు గుర్తింపు ఉన్న పార్టీగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చట్టసభకు తప్పకుండా నెగ్గాలి. అలాగే మొత్తం పోల్ అయిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవాలి. ఈ విధంగా రెండు నిబంధనలూ పూర్తి చేసినట్లు అయితేనే ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు దక్కుతుంది.
ఇక వెనక్కి తిరిగి చూసుకుంటే జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఆరు శాతం ఓటు షేర్ వచ్చినా లాభం లేకపోయింది. ఈసారి ఒంటరిగా పోటీ పడితే భీకరమైన పోరులో ఎలాంటి ఫలితాలు వస్తాయో అన సందేహాలతోనే పవన్ తెలివిగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అని అంటున్నారు. దీని వల్ల పెద్ద పార్టీ టీడీపీ అండదండలు అన్నీ కూడా పవన్ కి ఆయన పార్టీకి దక్కుతున్నాయి.
అసలు జనసేన బేఫికర్ గా తన రాజకీయాన్ని చేస్తోంది అంటే టీడీపీ ఇస్తున్న పూర్తి స్థాయి మద్దతుతోనే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేన అభిమానులు క్యాడర్, అలాగే బలమైన కాపు సామాజిక వర్గం పెద్దల నుంచి ఒక డిమాండ్ వస్తోంది. సీఎం పోస్టు అడగాలని అలాగే హోం మినిస్టర్ పోస్టు అడగాలని. అయితే అవసరాలు జనసేనకు చాలా ఉన్నాయని ఆ పార్టీ అధినేతగా పవన్ కి తెలిసినట్లుగా వారికి తెలియకపోవడం వల్లనే ఈ రకమైన డిమాండ్లు పెడుతున్నారు అని అంటున్నరు.
ఇక చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలికి వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు సీఎం సీఎం అని క్యాడర్ నినాదాలు చేశారు. దానితో పవన్ ఒక్కసారిగా అసహనానికి గురి అయ్యారు. సీఎం అంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు జనసేన మీదనే ఆయన కామెంట్స్ చేశారు. జనసేన ప్రస్తుతం గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ఉందని పవన్ కుండబద్ధలు కొట్టి వారికి చెప్పాల్సినది చెప్పారు
ఈ నేపధ్యంలో పార్టీ ముందు ఉన్న కర్తవ్యం సీఎం పదవి కానే కాదు అన్నట్లుగా మాట్లాడారు. ముందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవాలి. ఆ తరువాతనే మిగిలినవి అన్నీ అంటూ క్యాడర్ ఉత్సాహానికి నీరు కార్చేశారు. అయితే క్యాడర్ అసంతృప్తితో ఉండడాన్ని గమనించిన ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఆ సింహాద్రి నాధుని దయ ఉంటే కాలం కలసి వస్తే సీఎం అవుతానేమో అపుడు చూద్దామని చెప్పుకొచ్చారు.
మొత్తం మీద చూస్తే చాలా మంది విమర్శలు చేస్తున్నట్లుగా పవన్ టీడీపీతో కలవడం అన్నది అమాయకత్వంగానో రాజకీయ చాకచక్యం లేకుండానో చేసినది కాదు అన్నది ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. టీడీపీతో జత కడితే ఈసారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వస్తారు అలాగే ఆరు శాతం కంటే ఓటు షేర్ వస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈ ఎన్నికల అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా హోదా దక్కుతుంది.
ఆ తరువాత నుంచి జనసేన సొంత పలుకుబడి పెంచుకుంటూ రాజకీయంగా తన లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవడానికి చూస్తుందని అంటున్నారు. అందువల్ల పవన్ కుండబద్ధలు కొట్టి చెప్పినట్లుగా జనసేన తొలి టార్గెట్ సీఎం కానే కాదు గుర్తింపు పొందిన పార్టీ కావడమే. అందుకోసమే ఆయన టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే చేశారు అని అంటున్నారు. దాంతో పవన్ ఊరికే టీడీపీతో పొత్తు పెట్టుకోలేదని ఆయన రాజకీయం కూడా పదును తేరిందనే అంతా అంటున్నారు.