టీడీపీ కూటమిలో జనసేన మంత్రులు వీరే !?
ఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుందని ఒక ఖచ్చితమైన అంచనా అయితే ఉంది.
By: Tupaki Desk | 1 Jun 2024 1:30 PM GMTఏపీలో టీడీపీ కూటమి గెలుస్తుందని ఒక ఖచ్చితమైన అంచనా అయితే ఉంది. దీని మీద కూటమి నేతలు అంతా కూడా ధీమాగా ఉన్నారు. ఏపీలో అయిదేళ్ల అధికార వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకు విపరీతమైన వ్యతిరేకత ఉందని దాని ఫలితమే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయింది అని గుర్తు చేస్తున్నారు.
అంతే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలలో తరలివచ్చి ఓట్లు వేసినది కూడా కసితోనే అని అంటున్నారు. దీంతో టీడీపీ కూటమిలో మంత్రులు ఎవరు అన్న చర్చ కూడా మొదలైంది. టీడీపీ కూటమి పవర్ లోకి వస్తే ఈసారి జనసేనకు ఖ చ్చితంగా రెండు నుంచి మూడు బెర్తులు ఖాయమని అంటున్నారు.
అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కోరుకుంటే ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు కీలకమైన శాఖ అప్పగించవచ్చు అని కూడా అంటున్నారు. ఒకవేళ పవన్ తనకు మంత్రి పదవి వద్దు అని భావిస్తే మాత్రం జనసేన నుంచి మరో ముగ్గురు కీలక నేతలకు చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు.
అది కూడా సామాజిక సమీకరణలు రాజకీయ ప్రాంతీయ సమతూల్యతలు చూసుకుంటే ముగ్గురు కచ్చితంగా జనసేన నుంచి కూటమి ప్రభుత్వంలో చేరుతారు అని అంటున్నారు. ఆ ముగ్గురిలో అగ్ర తాంబూలం నాదెండ్ల మనోహర్ దే అని అంటున్నారు. ఆయన తెనాలి నుంచి జనసేన అభ్యర్ధిగా కూటమి సహకారంతో పోటీ చేశారు. ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు.
దాంతో నాదెండ్ల కూటమి మంత్రిగా ఉండే వారిలో మొదటి వ్యక్తి అని అంటున్నారు. అదే విధంగా చూస్తే రెండవ వారు గోదావరి జిల్లాలకు చెందిన కందుల దుర్గేష్. ఈయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఇక 2019లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరఫున పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు.
ఈసారి ఆయనకు రాజమండ్రి రూరల్ నుంచి సీటు దక్కలేదు. అయినా కూటమి ధర్మాన్ని పాటించి నిడదవోలు వెళ్ళి పోటీ చేశారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో పాటు ఆయన పార్టీ పట్ల చూపించిన విధేయత అన్నీ కలసి ఆయనకు జనసేన నుంచి కూటమి తరఫున మంత్రి పదవి దక్కేలా చేస్తాయని అంటున్నారు. అంటే కందుల దుర్గేష్ మంత్రిగానే ఈసారి చట్ట సభలో అడుగుపెడతారు అన్న మాట.
ఇక మూడవ బెర్త్ ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి అయిన కొణతాల రామకృష్ణకు దక్కుతుంది అని అంటున్నారు ఆయన ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితమే మంత్రి అయ్యారు. వైఎస్సార్ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు పోటీ చేశారు. ఆయన సమర్ధుడుగా వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు మంత్రి యోగం ఖాయమని అంటున్నారు.
ఇలా మూడు ప్రాంతాలు మూడు సామాజిక వర్గాలకు చెందిన నేతలు జనసేన నుంచి కచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మంత్రులు అవుతారని అంటున్నారు. ఈ ముగ్గురు సమర్ధులు కావడమే కాకుండా మచ్చ లేని రాజకీయ జీవితం గడపడం వల్ల జనసేనకు కూడా వీరి వల్ల మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం వీరి విషయంలోనే సిఫార్సు చేయవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో ఈసారి జనసేన అతి ముఖ్య భూమికను పోషిస్తుంది అని అంటున్నారు.