క్యాంపెయిన్ సాంగ్స్.. ఓట్లు రాలుస్తాయా? తాజాగా జనసేన పాట!
వీటిని ప్రతి రోజూ యూట్యూబ్‌లో ప్రతి పది నిముషాలకు ఒకసారి ప్రచారం చేస్తున్నారు.
By: Tupaki Desk | 21 March 2024 1:05 PM GMTఎన్నికల వేళ ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతు న్నాయి. ఒకవైపు సాధారణ ప్రచారం చేస్తూనే.. మరోవైపు డిజిటల్ ప్రచారంలోనూ దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు వైసీపీ చాలా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికి ఎనిమిది డిజిటల్ ప్రచార పాటలను విడుదల చేసింది. వీటిని ప్రతి రోజూ యూట్యూబ్‌లో ప్రతి పది నిముషాలకు ఒకసారి ప్రచారం చేస్తున్నారు.
యూట్యూబ్ ప్రచారాలపై ఇంకా ఈసీ దృష్టి సారించినట్టు లేదు. దీంతో ఈ ప్రచారాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఇక, వైసీపీకి పాటలు రాసింది.. పాడింది కూడా.. ప్రముఖ సంగీత దర్శకుడనే వాదన ఉంది. ఇదిలావుంటే, టీడీపీ కూడా కొన్ని పాటలను సిద్దం చేయిస్తోంది. ఇవి ప్రస్తుతం రూపకల్పన దశలోనే ఉన్నాయి. ఇంతలోనే జనసేన నుంచి తాజాగా ఒక పాట విడుదలైంది. అయితే. ఇది ఎక్కువ నిడివి ఉండడంతో ఏమేరకు ప్రజలను ఆకర్షిస్తుందనేది చూడాలి.
జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం పాట.. ``భగభగ మండిన భగత్ సింగుర పవను.. ఊదరా జంగ్ సైరను`` అనే పల్లవితో సాగే పాట ఈ రోజు విడుదలైంది. నల్గొండ గద్దర్ గా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు నరసన్న ఈ గీతాన్ని ఆలపించారు. ఇందులో, ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ తన నటించారు. జనసేన, పవన్ కల్యాణ్ లను హైలైట్ చేస్తూ, విప్లవతేజం చేగువెరాను ప్రస్తావిస్తూ ఈ జంగ్ సైరన్ పాట సాగుతుంది.
నల్గొండ గద్దర్ నరసన్న గళం, ఉర్రూతలూగించేలా జానీ మాస్టర్ స్టెప్పులతో ఈ ఎన్నికల గీతం యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే.. ఎన్నికల ప్రచార గీతాలు ఏమేరకు ఏ పార్టీకైనా ఓట్లు రాలుస్తాయా? అంటే.. కొంత వరకు సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు మాత్రం ఉపయోగపడతాయని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే.. పాటలతోనే ఎన్నికల్లో గెలుస్తారా? అంటే చెప్పడం కష్టం. కాబట్టి.. ఇది కొంత పార్టీలకు ఊపైతే తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.