జనసేన టీడీపీ ప్రభుత్వమట... పవన్ సీఎం పక్కా ...?
ఏపీలో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఈ వేడిలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Sep 2023 10:12 AM GMTఏపీలో రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ఈ వేడిలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. పది రోజుల క్రితం జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబుని పరామర్శించి వచ్చి వెంటేనే టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన తొందరపాటు అనుకున్నారు. జనసేనకు బేరమాడే శక్తి లేకుండా చేసుకున్నారు అనుకున్నారు.
కానీ ఆ తరువాత జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన ఇపుడు కీ రోల్ ప్లే చేసేలా ఉంది అని అంటున్నారు. లేటెస్ట్ గా తిరుపతిలో జరిగిన జనసేన నేతల మీటింగులో పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఏపీలో 2024 ఎన్నికలలో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని సంచలన ప్రకటన చేశారు. ఆయన టీడీపీ జనసేన అనలేదు, జనసేన ముందు పెట్టి తరువాత టీడీపీని పెట్టారు, ఇది అండర్ లైన్ చేసుకోవాల్సిన రాజకీయ అంశం అనే అంటున్నారు. అంటే పొత్తులో భాగంగా జనసేన భారీగా సీట్లను తీసుకోవడమే కాకుండా కూటమి గెలిస్తే కనుక అధికారంలో వాటా కూడా కోరుతుందని నాగబాబు చేసిన ప్రకటనను బట్టి అర్ధం అవుతోంది అని అంటున్నారు.
అధికారంలో వాటా అనుకుంటే కనుక సీఎం సీటు షేరింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. అంటే చంద్రబాబు పవన్ ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారా అన్న చర్చ కూడా బయలుదేరింది. ఇక సడెన్ గా నాగబాబు ఎంట్రీ ఇవ్వడం తిరుపతిలో క్యాడర్ ని ఉద్దేశించి ఈ తరహా కామెంట్స్ చేయడంతో ఈ పొత్తు విషయంలో చాలా లెక్కలే ఉన్నాయని అంటున్నారు.
అంతే కాదు రెండు పార్టీల మధ్య పొత్తుని భగ్నం చేసే విధంగా ఎవరూ కామెంట్స్ చేయరాదు అన్నారు. పొత్తులు తూట్లు పొడిచే ప్రయత్నం చేయవద్దు అంటున్నారు. ఇక నాగబాబు జిల్లాల టూర్లు మొదలెట్టడం వెనక గ్రౌండ్ లెవెల్ లో జనసేన క్యాడర్ ని లీడర్ ని టీడీపీతో పొత్తుకు సుముఖంగా చేస్తూ ముందుకు నడిపించడానికి అని కూడా అంటున్నారు.
ఇక టీడీపీకు అవుట్ రేట్ గా జనసేన సపోర్ట్ చేసింది అని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదని టీడీపీ ఇపుడున్న పరిస్థితుల్లో నైతికంగా, రాజకీయంగా జనసేన మద్దతు ఆక్సిజన్ గా మారుతోంది కాబట్టి కచ్చితంగా జనసేనకు యాభై నుంచి అరవై సీట్లు ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇక జనసేనకు కేవలం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో మాత్రమే సీట్లు ఇస్తారని ప్రచారంలో ఉంది.
కానీ ఇపుడు నాగబాబు రాయలసీమలో టూర్ చేస్తూ మీటింగ్స్ పెడుతున్నారు. అంటే మొత్తం ఉమ్మడి ఏపీలోని పదమూడు జిల్లాలలో జనసేనకు సీట్లు అడుగుతారు, అలాగే తీసుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనసేన టీడీపీ ప్రభుత్వం అని నాగబాబు నొక్కి చెప్పడం ద్వారా కచ్చితంగా అధికారంలో తాము ఉంటామని చెప్పడమే అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే జనసేన టీడీపీ సర్కార్ అంటే పవన్ సీఎం పక్కా అని ఆ సందేశం ఇవ్వడానికే నాగబాబు రంగంలోకి దిగారని అంటున్నారు. మరి అది నిజంగా జరుగుతుందా టీడీపీ అంతటి భారీ త్యాగం చేస్తుందా అంటే కొన్ని అనివార్యమైన పరిస్థితులలో అనూహ్య పరిణామాలు జరగడం మామూలే అన్న వారూ ఉన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అంటున్నారు.
సీఎం పోస్ట్ పవన్ కి ఇవ్వకపోతే ఈ పొత్తు నూరు శాతం సక్సెస్ కాదు కాబట్టి ఆ దిశగానే ఒప్పందాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ పాలిటిక్స్ లో భారీ ట్విస్టులు చోటు చెసుకోబోతున్నాయనే అంటున్నారు. చూడాలి మరి అవి ఎలా ఏ రూపం తీసుకుంటాయో.