Begin typing your search above and press return to search.

ఔర్ ఏక్ బార్ మోడీజీ ఆనా చాహియే...పవన్ కళ్యాణ్

మోడీ మరోసారి ప్రధాని కావాలి. ఇది జనసేనాని బలమైన కోరిక. దాన్ని ఆయన మోడీ ముందే ఆవిష్కరించారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 3:52 AM GMT
ఔర్ ఏక్ బార్ మోడీజీ ఆనా చాహియే...పవన్ కళ్యాణ్
X

మోడీ మరోసారి ప్రధాని కావాలి. ఇది జనసేనాని బలమైన కోరిక. దాన్ని ఆయన మోడీ ముందే ఆవిష్కరించారు. తెలంగాణా ప్రజల సాక్షిగా ఆయన వేదిక మీద కీలక ప్రసంగం చేస్తూ మోడీ మూడవసారి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకున్నారు. మోడీ ప్రధాని ఎందుకు కావాలంటే ఈ దేశం బాగుపడడానికి అని పవన్ అంటున్నారు.

మోడీ మాత్రమే ఈ దేశం దశ దిశ మార్చగలరని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ పదేళ్ల పాలన దేశానికి స్వర్ణ యుగం అని కూడా పవన్ కీర్తించారు. ఇంటా బయటా మోడీ సాధించిన విజయాలు అపూర్వం అని కూడా పవన్ అన్నారు సమర్ధ నాయకుడు ఉంటే దేశం ఎలా ప్రగతి సాధిస్తుందో మోడీ అమలు చేసి చూపించారని అన్నారు.

మోడీని గెలిపించుకోవడం అందరి బాధ్యతగా చెప్పారు. ఒక విధంగా మోడీ పాలన మీద పవన్ పొగడ్తల వర్షమే కురిపించేశారు. మోడీ ప్రతీ భారతీయుడి గుండెలలో ధైర్యాన్ని నింపారని పవన్ పేర్కొన్నారు. మోడీకి దేశం అంటే ప్రేమాభిమానాలు ఉండబట్టే చిత్తశుద్ధితో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

ఈ దేశంలో ఎన్నడూ చూడని చేయని సాహసోపేత నిర్ణయాలు ఎన్నో మోడీ తీసుకున్నారని కూడా పవన్ అన్నారు. మొత్తానికి దేశానికి మోడీ నాయకత్వం అవసరం అని పవన్ గట్టిగానే చెప్పారు. నిజంగా బీజేపీ నాయకులు తప్ప మరెవరూ మోడీ గురించి ఇంత గొప్పగా ఇంత విశాల హృదయంతో చెప్పిన ఉదాహరణలు అయితే లేవు.

ఎందుకంటే మోడీ విషయంలో మిత్రపక్షాలు కూడా తన పరిధులు పరిమితులు రాజకీయ లాభ నష్టాలు చూసుకునే ఆచి తూచీ మాట్లాడుతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీకి మిత్ర పక్షం నేతగా కాకుండా మోడీకి అభిమానపాత్రుడిగా మారిపోయారు అని అంటున్నారు

మోడీ ప్రధాని కావాలని 2047 విజన్ అన్నది నెరవేరాలని పవన్ కోరుకుంటున్నారు. మరి పవన్ ఆలోచనలు ఆయనతో పొత్తు పెట్టుకుంటున్న తెలుగుదేశం లోనూ ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న. అలాగే రేపటి రోజున ఈ దేశంలో ఇండియా కూటమి ఒక వైపు ఉంటే ఎన్డీయే మరో వైపున ఉంది. పవన్ అయితే తాను ఎన్డీయే పక్షం అని చెప్పుకున్నారు ఓపెన్ కూడా అయిపోయారు

మరి టీడీపీ ఆ విధంగా ఉంటుందా ఓపెన్ అవుతుందా అన్నది మరో ప్రశ్న. ఏపీలో చూసుకుంటే పవన్ బీజేపీ జట్టు వదలకపోవచ్చు అన్నది ఆయన తాజా ప్రకటనల బట్టి అర్ధం అవుతోంది. మరి బీజేపీతో కాకుండా కమ్యూనిస్టులతో టీడీపీ దోస్తీ కడితే అపుడు పవన్ రూట్ ఎటూ అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కి మోడీ మూడవసారి ప్రధాని కావడం ఇస్ఠం. అది ఆయన రాజకీయ వ్యూహాలకు అతీతమైనదిగా కూడా భావించాలి. మరి రానున్న రోజులలో ఏపీలో ఏ రాజకీయ సమీకరణలను ఈ స్లోగన్ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.