పవన్ ని సైనిక్స్ అర్ధం చేసుకోవడం లేదా...?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఊపే వేరు. ఫ్యాన్స్ కి వచ్చే హుషారే వేరు. పవన్ అన్న మూడు అక్షరాలు వారికి తారకమంత్రంగా ఉంటాయి
By: Tupaki Desk | 8 Dec 2023 10:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఊపే వేరు. ఫ్యాన్స్ కి వచ్చే హుషారే వేరు. పవన్ అన్న మూడు అక్షరాలు వారికి తారకమంత్రంగా ఉంటాయి. పవన్ వస్తారంటే చాలు చాలా ముందే జనాలు సభా స్థలికి చేరుకోవడం అంతా చూస్తున్నదే. పవన్ కళ్యాణ్ సభ అంటే జన సంద్రాన్ని తలపించాలి.
అలాంటిది పవన్ విశాఖలో గురువారం నిర్వహించిన సభ మాత్రం జనం తగ్గి వెలితిగానే కనిపించింది. విశాఖలోని ఆల్వార్ దాస్ స్టేడియంలో నిర్వహించిన సభలో జనాలు పెద్దగా రాకపోవడం పట్ల ఇపుడు జనసేనలో కూడా అంతర్మధనం జరుగుతోంది. నిజానికి చూస్తే ఈ స్టేడియం బాగా చిన్నది. పెద్ద మీటింగ్స్ అంటే విశాఖలో వేరేవి చూస్తారు.
కానీ ఒక మాదిరి కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలోనే పవన్ సభకు సగం ఖాళీ కనిపించడం గమనార్హం. పైగా పవన్ వచ్చే సమయానికి కూడా జనాలు లేకపోవడం కూడా జరిగింది. దాంతో ఎందుకిలా అన్న చర్చ అయితే ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాలలోనూ జరుగుతోంది.
పవన్ ఇటీవల కాలంలో తన స్పీచ్ లో ఎక్కువగా పొత్తుల గురించి చెబుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు అనివార్యం అని ఆయన మాట్లాడుతున్నారు. మరో అయిదేళ్ళు వేచి ఉండలేమని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసే చాన్స్ తీసుకోలేమని తాజా సభలోనూ పవన్ చెప్పుకొచ్చారు. మనకు కావాల్సింది వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అని పవన్ అంటుంటే జనసైనికులు కన్వీన్స్ అవడం లేదా అన్న చర్చ సాగుతోంది.
పవన్ ప్రసంగిస్తున్నంత సేపూ సీఎం అంటూ క్యాడర్ నినాదాలు చేశారు. దాంతో పవన్ అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇలా నినాదాలు చేస్తారు గాజువాకలో ఓడించారు అని ఆయన ఒక దశలో కోపం కూడా ప్రదర్శించారు. సీఎం అనడం కాదు మీ ఓట్లు ట్రాన్స్ ఫర్ కావాలి అని పవన్ పదే పదే కోరడం జరిగింది. సీఎం విషయం ఎన్నికల తరువాత అని దాటవేయడం కూడా జనసైనికులకు తీవ్ర నిరుత్సాహం కలిగిస్తోంది అని అంటున్నారు
ఒకసారి పవన్ పదవులు ముఖ్యం కాదు సీట్లూ ఓట్లు ముఖ్యం కాదు అని కూడా అన్నారు. ప్రజా సేవ ముఖ్యం, జాతీయ భావన సమగ్రత ముఖ్యం అని కూడా అన్నారు. మొత్తానికి చూస్తే మాత్రం పవన్ తాను సీఎం అవుతాను అని గట్టిగా చెప్పకపోవడం వల్లనే జనసైనికులలో హుషార్ తగ్గుతోందని అంటున్నారు. దాని వల్లనే ఆయన సభలకు వచ్చే వారు కూడా తగ్గుతున్నారని అంటున్నారు.
చంద్రబాబుని సీఎం ని చేయడానికే పొత్తులు అంటూ ఒక వైపు వైసీపీ విమర్శలు చేస్తూంటే దాన్ని బలంగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో జనసేన శ్రేణులు ఉన్నాయి. పవన్ సైతం సీఎం అవుదామని అన్న వారి మీద అసహనం వ్యక్తం చేయడం కూడా కరడు కట్టిన అభిమానులకు మింగుడుపడడంలేదు అంటున్నారు.
ఇక బలమైన కాపు సామాజికవర్గంలో కూడా దీని మీదనే నిరాశ కనిపిస్తోంది అని అంటున్నారు. రాజకీయ అనివార్యత కల్పించడం ద్వారానే పవన్ సీఎం కాగలరని అలా జరగాలంటే కర్నాటకలో కుమారస్వామి మాదిరిగా ఒంటరిగా పోటీకి దిగితే ఆయనకు గతం లో కాకుండా కనీసంగా పాతిక ముప్పయి సీట్లు వస్తాయని అంచనా కడుతున్నారు.
అపుడు హంగ్ అసెంబ్లీ కచ్చితంగా వస్తుందీని అంటున్నారు. అలా ఏర్పడిన రాజకీయ అనివార్యతలో నుంచి సీఎం పదవి వస్తుందని ఇదంతా వ్యూహంగా ఉండాలని అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఒంటరి పోరుకు చాన్సే లేదని తాజా విశాఖ సభలో తేల్చేశారు. టీడీపీతోనే పొత్తు అని తన బాటలో నడిచే వారు నమ్మే వారే తనతో ఉంటారని కూడా ఆయన చెప్పడంతోనే మునుపటి ఉత్సహం అయితే జనసేనలో కనిపించడంలేదు అంటున్నారు. దాని వల్లనే జనసేనకు జనం తగ్గుతున్నారని అంటున్నారు
ఇక దీని మీద వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు. జనసేనకు జనం మందగిస్తున్నారు అంటే టీడీపీతో పొత్తు ప్రభావమే అని అంటుననరు. టీడీపీ జనసేన పొత్తును జనాలు తిరస్కరిస్తున్నారు అని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మరో వైపు విశాఖలో జనసేన పార్టీ పరిస్థితిని బేరీజు వేయడానికి పవన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం విశేషం.