గోదావరి సీన్ చేంజ్ : బ్రాహ్మణికి జనసేన సపోర్ట్
గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. పై స్థాయిలోనే కాకుండా దిగువ స్థాయిలోనూ జనసేన నేతలు టీడీపీతో కలసి వెళ్లేందుకు పూర్తిగా సంసిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 24 Sep 2023 10:07 AM GMTగోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. పై స్థాయిలోనే కాకుండా దిగువ స్థాయిలోనూ జనసేన నేతలు టీడీపీతో కలసి వెళ్లేందుకు పూర్తిగా సంసిద్ధమవుతున్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోడలు అయిన నారా బ్రాహ్మణికి జనసేన నేతలు సంఘీభావం ప్రకటించారు. రెండు పార్టీలు కలసి మెలసి పనిచేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల మీద వారు చర్చించారు. జనసేనకు చెందిన నేత కందుల దుర్గేష్, టీడీపీకి చెందిన మాజీ మంత్రి చిన రాజప్పతో పాటు జనసేనకు చెందిన జిల్లా కీలక నాయకులు బ్రాహ్మణితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపధ్యంలో రెండు పార్టీలు కలసి ఉమ్మడిగా ఉద్యమించాలని కూడా నిర్ణయించారు. భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా తీర్మానించారు. అనంతరం కందుల దుర్గేష్ విలేకరులతో మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ఇక మీదట ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రెండు పార్టీలు ఒక్క త్రాటి మీదకు వస్తాయని చెప్పారు. త్వరలోనే టీడీపీ జనసేన కలసి పోరాటం చేసేందుకు రెడీ అవుతాయని అన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కార్యాచరణ అంటూ కొన్ని రోజులుగా వినిపిస్తున్న దానికి ఆచరణలో పెట్టేందుకు రెండు పార్టీల జిల్లా స్థాయి నేతలు సిద్ధపడుతున్నారు అని తెలుసోంది. గోదావరి జిల్లాలలో ఈరెండు పార్టీలు ఒక్కటిగా నిరసనలు తెలియచేస్తే ఆ మీదట రాష్ట్రమంతటా కూడా అది విస్తరిస్తుందని కూడా భావిస్తున్నారు.
రానున్న రోజులలో బ్రాహ్మణి కూడా రాజకీయంగా యాక్టివ్ గా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరో వైపు చంద్రబాబు రిమాండ్ లో మరి కొన్ని రోజులు ఉండాలంటే కనుక బ్రాహ్మణి స్వయంగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. ఈ క్రమంలనే జనసేన నేతలు కూడా కలసి వచ్చారని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో పరిణామాలు ఏ కీలకమైన మలుపు తీసుకుంటాయో.