జగ్గంపేటలో జ్యోతులకు జనసేన బిగ్ స్ట్రోక్!
అవును... మాంచి ముహూర్తం చూసి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీలో అసమతి సెగలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇ
By: Tupaki Desk | 28 Feb 2024 10:25 AM GMTటీడీపీ - జనసేన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన అనంతరం మొదలైన అసమ్మతి సెగలు చల్లారడం లేదు సరికదా రోజు రోజుకీ మరింత ఎగసిపడుతున్నాయి! మరోపక్క జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబులు ఈ అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నం చేయకుండా గాలికి వదిలేశారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. దీంతో అగ్నికి వాయువు తోడైన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ సెగ తాజాగా జ్యోతుల నెహ్రూకు గట్టిగా తగులుతుందని తెలుస్తుంది.
అవును... మాంచి ముహూర్తం చూసి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీలో అసమతి సెగలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇవి సాధారణ రాజకీయ అసమతి సెగలైతే ఒకటి రెండు రోజుల్లో చల్లారేవి కానీ.. ఇవి చాలా ఎమోషన్ తో కూడుకున్న సెగలు కావడంతో రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూని గెలవనివ్వనంటూ శపథం చేస్తున్నారు జనసేన నేత!
వివరాళ్లోకి వెళ్తే... జనసేన, టీడీపీలో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో కొంతమంది ఇప్పటికే ఆయా పార్టీలకు రాజీనామా చేయగా.. మరికొంతమంది పార్టీలోనే ఉంటూ, మిత్రపక్షానికి సహకరించేది లేదంటూ, వారి ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సమయంలో జగ్గంపేటలో జనసేన నేత పాతంశెట్టి సూర్యచంద్ర నిప్పులు కక్కుతున్నారు.
తాజాగా కూటమి ప్రకటించిన తొలి జాబితాలో జగ్గంపేట టిక్కెట్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. ఇందులో భాగంగా జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరుపున పోటీ చేయబోతున్నారు. దీంతో... తనకు జగ్గంపేట టిక్కెట్ దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసేన నేత సూర్యచంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇందులో భాగాంగా... టీడీపీ నేత నెహ్రూపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు! తనకు టిక్కెట్ రాకపోయినా పర్లేదు కానీ జ్యోతుల నెహ్రూని మాత్రం గెలవనివ్వనని సూర్యచంద్ర గట్టిగా చెప్పారు. జగ్గంపేటలో జనసైనికులు ఇప్పటికే అనేక రౌండ్లు ప్రచారం చేసి, పార్టీకోసం తీవ్రంగా కష్టపడ్డారని.. ఈ సమయంలో ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేలా చూస్తానని అన్నారు. అంతేతప్ప నెహ్రూని మాత్రం గెలవనివ్వనని శపథం చేశారు!
దీంతో... జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు గట్టి దెబ్బే తగిలేలా ఉందనే చర్చ మొదలైంది. కాగా... తణుకు టిక్కెట్ పై వేల మంది ప్రజల సమక్షంలో పవన్ తనకు మాట ఇచ్చి ఇప్పుడు తప్పారంటూ విడివాడ రామచంద్రరావు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రెబల్ గా పోటీచేస్తానని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా జగ్గంపేటలోనూ సేం సీన్ రిపీట్ అవుతున్నట్లుగా ఉంది!!