జనసేనకు మెగా మద్దతు ప్లస్సేనా.. ?
నిజానికి చిరంజీవి సపోర్ట్ పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ అంతా జనసేనకు ఎప్పటి నుంచో ఫుల్ సపోర్టుగా ఉన్నారు
By: Tupaki Desk | 9 Aug 2023 4:05 AM GMTజనసేనను గత పదేళ్ళుగా పవన్ కళ్యాణ్ పడుతూ లేస్తూ తానే నడిపిస్తున్నారు. ఆయన ఒంటరి పోరాటమే చేస్తున్నారు. జనసేన పడుతున్న ఇబ్బందుల వెనక క్రీనీడగా ప్రజారాజ్యం ఫెయిల్యూర్స్ ఉన్నాయని కూడా అంటూంటారు. ప్రజరాజ్యం ఎన్నో ఆశలతో పుట్టి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.
అలా ప్రజారాజ్యం నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్న వారంతా జనసేన వైపు రిస్క్ చేసి చూడడానికి ఇష్టపడలేదు అని అంటారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పుట్టి అంతర్ధానం అయిన క్రమంలో మొత్తం వయస్సు మూడేళ్ళు మాత్రమే. అదే జనసేనను పవన్ పదేళ్ళుగా గట్టిగానే నడిపిస్తున్నారు. విజయాలు పరాజయాలతో సంబంధం లేకుండా పవన్ నడిపిస్తున్నారు.
ఇక్కడ ఒక విషయంలో పవన్ సక్సెస్ అయ్యారు. తాను పార్టీని విలీనం చేయను అని రద్దు చేయను అని తుదికంటా నడిపిస్తాను అని చెప్పడంతో మాత్రం ఆయన విజయవంతం అయ్యారు. అలా ఆయన చాలా మందికి మొదట్లో ఉన్న అపనమ్మకాలను పోగొట్టేలా చేశారు.
దాని ఫలితం ఇపుడు కనిపిస్తోంది. 2024 ఎన్నికల వేళ జనసేన గ్రాఫ్ మెల్లగా పెరుగుతోంది. ఏపీలో మూడవ పార్టీగా జనసేన నిలదొక్కుకోగలదు అన్న భరోసా కూడా రాజకీయ జీవులతో పాటు ఆ సామాజిక వర్గీయులలో ఏర్పడుతోంది.
ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ మద్దతు కూడా జనసేనకు లభిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరినీ రావాలని కోరుకోలేదని అంటారు. మా మామయ్యకు మా మద్దతు అవసరం లేదు అయినా ఆయన పిలిస్తే మేము రావడానికి సిద్ధమని ఈ మధ్యనే నటుడు సాయి తేజ్ చెప్పుకొచ్చారు. ఇక నాగబాబు ఎటూ ఉన్నారు ఇపుడు మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.
దాంతో జనసేనకు ఆయన ఇక పూర్తిగా దగ్గర అవుతారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది జనసేనకు మేలు చేస్తుందా లేక ఏమి చేస్తుంది అన్న చర్చ మొదలైంది. నిజానికి చిరంజీవి సపోర్ట్ పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ అంతా జనసేనకు ఎప్పటి నుంచో ఫుల్ సపోర్టుగా ఉన్నారు. చిరంజీవి కొత్తగా మద్దతు ఇచ్చినా అదనంగా ఏమి వస్తుంది అనేది చూడాల్సి ఉంది అంటున్నారు.
సమాజంలో కొన్ని సెక్షన్లను మెగాస్టార్ అట్రాక్ట్ చేయగలరు అనుకున్నా ఆయన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేస్తున్న టైం లోనే ఏపీ విభజన సాగింది. ఇక నాడు ఏపీకి ఏమీ చేయలేదని అపుడే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వారు మెగాస్టార్ మీద విమర్శలు మొదలెట్టేశారు. ఆయన ఫుల్ గా ఫీల్డ్ లోకి దిగితే ఆయన మీద మరిన్ని విమర్శలతో వస్తారు.
అంతే కాదు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ స్టోరీని కూడా బయటకు తీసే వారూ ఉంటారు. ఏది ఏమైనా చిరంజీవి జనసేన తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారా అన్నది చర్చగానే ఉంది. ఆయన వల్ల ప్లస్ ఉండవచ్చు కానీ అదే టైం లో ఆయన మూడేళ్ళ పాటు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు కాబట్టి చాలా విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.
జనసేనలో పవన్ సహా ఎవరూ అధికారాన్ని అనుభవించలేదు కాబట్టి ఇప్పటిదాకా వారు ఏమి చేశారు అన్న ప్రశ్న తలెత్తదు. అదే చిరంజీవి మద్దతుగా వస్తే మళ్లీ విభజన హామీలు ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదు, విభజన జరగకుండా ఎందుకు ఆపించలేదు ఇత్యాది ప్రశ్నలతో వైసీపీయే విరుచుకుపడే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక పొత్తులు లేకపోతే టీడీపీ నుంచి కూడా విమర్శలు వస్తాయని అంటున్నారు.