కారు గిఫ్ట్ వద్దంటున్న ఎమ్మెల్యే... కారణం క్లియర్!
పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 July 2024 4:00 AM GMTపోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్ద ఎత్తున హడావిడి ఉంటుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారుతో పాటు మరికొన్ని కార్లు రయ్ రయ్ మంటూ తిరుగుతుంటాయి. అలాంటిది.. ఒక ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో మోటర్ సైకిల్ పై తిరుగుతున్నారు. ఇది చూసిన కార్యకర్తలు ఓ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బాలరాజు సామాన్య కుటుంబం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే... నిత్యం పలు కార్యక్రమాలపై నియోజకవర్గంలో తిరగడానికి ఆయనకు కారు లేదు. ఈ విషయాన్ని గమనించిన జనసైనికులు తమ అభిమాన ఎమ్మెల్యేకు కారు కొని బహుమతిగా ఇవ్వాలని భావించారు.
అంతే.. అనుకున్నదే తడవుగా అందరూ ఒకటై లగ్జరీ కారును గిఫ్ట్ గా అందజేశారు. తమకు తోచినంత విరాళాలు వేసుకుని రూ. 10 లక్షలు పోగు చేశారు. ఈ మొత్తన్ని డౌన్ పేమెంట్ గా కట్టి.. ఎమ్మెల్యేకు వైట్ కలర్ ఫార్చ్యునర్ కారును కొనిచ్చారు. మిగతా సొమ్మును నెల నెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ బహుమతిని ఎమ్మెల్యే బాలరాజు సున్నితంగా తిరస్కరించారు.
అవును... జనసైనికులు తనకు బహుమతిగా ఇచ్చిన ఫార్చ్యునర్ కారును ఎమ్మెల్యే బాలరాజు సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా... మొట్టమొదటిగా జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. జనసైనికులంతా గెలిచిన సందర్భంగా తనకు కారును బహుమతిగా ఇచ్చారని, ఇది చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు.
అయితే... జనసేన పార్టీకి సంబంధించి పవన్ కల్యాణ్ కానీ, తాము కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ వచ్చామని.. జనసైనికులు తనపై చూపించిన అభిమానానికి, నమ్మకానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అనంతరం... తనకు ఇచ్చిన కారు బహుమతిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఆ బహుమతిని జనసైనికులకే తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.