జనసేనకు24 సీట్లు ఎక్కువ? తక్కువ?
గతానికి వర్తమానానికి పరిస్థితులు మారిపోయాయి. ఒకనాటి రాజకీయంతో ఇప్పటి రాజకీయాన్ని అస్సలు పోల్చలేం
By: Tupaki Desk | 26 Feb 2024 12:09 PM GMTగతానికి వర్తమానానికి పరిస్థితులు మారిపోయాయి. ఒకనాటి రాజకీయంతో ఇప్పటి రాజకీయాన్ని అస్సలు పోల్చలేం. మరీ.. ముఖ్యంగా గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. రాజకీయం అంటే నిర్వచనమే మారిపోయింది. దీనికి తోడు ఆయుధంలా మారిన సోషల్ మీడియా పుణ్యమా అని.. రాజకీయ పార్టీలు నిజాల కంటే అబద్ధాల్ని.. అసత్యాల్ని తమ వ్యూహానికి తగ్గట్లుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి.
తెలుగుదేశం.. జనసేనకు మధ్య పొత్తు కుదురుతుందన్నది పాత విషయం. ఆ మాటకు వస్తే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అన్నది కూడా పాత ముచ్చటే. ఎందుకుంటే.. పొత్తు అన్నంతనే జనసేనకు ఎన్ని సీట్లు? అన్న లెక్కలు వచ్చినప్పుడు.. ఏపీ వ్యాప్తంగా ఉన్న 175 స్థానాల్లో ఆ పార్టీకి పొత్తు ధర్మంలో భాగంగా ఎవరూ 30కి మించి చెప్పింది లేదు. ఆ మాటకు వస్తే ఏపీ అధికార పక్ష నేతలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో జనసేనకు ముప్ఫై లోపు సీట్లు కేటాయిస్తే.. తమకు ఇబ్బంది అన్న మాటను తరచూ చెప్పటం కనిపిస్తుంది.
మీడియా వర్గాలు సైతం జనసేనకు పదిహేను నుంచి పాతిక మధ్యనే సీట్ల కేటాయింపు లెక్కలు చెప్పారే కానీ.. ఏ రోజు యాబై.. 75 సీట్లు లాంటి మాటలు ఏ ఒక్కరు మాట్లాడింది లేదు. ఏపీలోని ఉమ్మడి జిల్లాలైన 13లో.. జనసేనకు బలమైన నేతలు ఉన్న జిల్లాలు కొద్దిగానే ఉన్నాయి. నిజానికి పార్టీకి ఉన్న అభిమానులతో పోలిస్తే.. ఆ అభిమానానికి అవసరమైన నేతల సంఖ్య తక్కువగానే ఉందని చెప్పాలి. పవన్ మైండ్ సెట్.. ఆయన తీరు సగటు రాజకీయ పార్టీ అధినేత తీరుకు భిన్నంగా ఉండటమే దీనికి కారణం.
ఏమైతేనేం కానీ పవర్ చేతికి రావటం అనే కాన్సెప్టుకు పవన్ కల్యాణ్ విరుద్ధం. ఈ కారణంగానే ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటానికి కారణమైంది. గడిచిన ఐదేళ్లలో ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఆయనలో కొంత మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే.. మారాల్సింది ఇంకా చాలానే ఉందని చెప్పాలి. ఇక.. సీట్ల కేటాయింపు విషయానికి వస్తే.. పొత్తులోభాగంగా రెండు పార్టీల మధ్య కుదిరిన 24 సీట్ల ఒప్పందం ఉన్నంతలో రెండుపార్టీలకు విన్ టు విన్ అన్నట్లు చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెబితే.. 18స్థానాలకు మించిన ఇచ్చే ప్రతి సీటు.. ఓడిపోవటమే తప్పించి గెలిచే అవకాశం లేదన్న వాదనలు కొందరు వినిపిస్తున్నారు. మొత్తంగా జనసేనకు కేటాయించిన 24 సీట్లు గౌరవప్రదమైనవిగా చెప్పాలి.
రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నట్లుగా యాభై నుంచి 75 స్థానాలు కేటాయించారనే అనుకుందాం? అప్పుడేమవుతుంది?అసలు అంతమంది నేతలు జనసేనలో ఉన్నారా? అన్నది ప్రశ్న. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లుగా.. పార్టీని తాను తీర్చిదిద్దిన దానికి తగ్గట్లే జనసేనకు 24 సీట్లు కేటాయించటం ఎక్కువే కానీ తక్కువ మాత్రం కాదని చెప్పక తప్పదు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా తెలియంది కాదు. అందుకే.. ఆయన విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు. అంతేకాదు.. తమ పొత్తు లెక్కలు బహిరంగ పర్చిన తర్వాత వచ్చే విమర్శల తీవ్రత ఆధారంగా తమ లెక్క కరెక్టుగా ఉందన్న విషయాన్ని అటు టీడీపీ - ఇటు జనసేన వర్గాలు ప్రైవేటు సంభాషణల్లో వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తంగా చూస్తే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 సీట్లు తక్కువ కాదు.. కాస్తంత ఎక్కువేనని చెప్పక తప్పదు.