Begin typing your search above and press return to search.

జనసేన కోరుతున్న నామినేటెడ్‌ పోస్టులు ఇవే!

ఈ జాబితాను గ్రామ స్థాయి, మండల స్థాయిల్లో కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ తో సరిపోల్చుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2024 1:30 PM GMT
జనసేన కోరుతున్న నామినేటెడ్‌ పోస్టులు ఇవే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చి నెల దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్‌ పోస్టులపైన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన పార్టీ కోసం కష్టపడిన నేతల జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ జాబితాను గ్రామ స్థాయి, మండల స్థాయిల్లో కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ తో సరిపోల్చుకుంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో పార్టీ కోసం నిజంగా కష్టపడిందెవరు? పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంది ఎవరు? వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్నవారు, ఆర్థికంగా నష్టపోయినవారు.. ఇలా అన్ని వివరాలను చంద్రబాబు తెప్పించుకున్నారని తెలుస్తోంది.

పార్టీ కోసం అంకితభావంతో కష్టపడినవారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా ఆయన కార్యకర్తలు, స్థానిక నాయకుల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు. నిజంగా కష్టపడ్డవారికి ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.

మొత్తం నామినేటెడ్‌ పోస్టులు 114 వరకు ఉన్నాయని అంటున్నారు. వీటిలో వివిధ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్, వైస్‌ చైర్మన్, డైరక్టర్‌ పదవులు ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్‌ మంత్రి హోదా ఉండటంతో పోస్టులు దక్కించుకోవడానికి నేతల నుంచి భారీ పోటీ ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఏపీఎస్‌ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌), తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంటి వాటి చైర్మన్‌ పదవులను దక్కించుకోవడానికి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా జనసేన, బీజేపీలతో పొత్తు ఉండటంతో వారికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా బీజేపీని పక్కనపెట్టినా జనసేనకు పదవులు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే 25 మంది జాబితాను పవన్‌ కళ్యాణ్‌.. చంద్రబాబుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే 25 సంస్థలు, కార్పొరేషన్లకు జనసేన నేతలు చైర్మన్లుగా ఉండనున్నారు.

ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో చెరో ఒకదాన్ని టీడీపీ, జనసేన పంచుకున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు నామినేటెడ్‌ పోస్టులను టీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. అయితే సాధారణంగానే టీడీపీకి ఎక్కువ పదవులు లభించనున్నాయి. అందులోనూ పొత్తులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో కొందరు కీలక నేతలకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు దక్కలేదు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున సీట్లు లభించనివారిలో ఆలపాటి రాజా (తెనాలి), బూరుగుపల్లి శేషారావు (నిడదవోలు), జలీల్‌ ఖాన్‌ (విజయవాడ పశ్చిమ), దేవినేని ఉమా (మైలవరం), ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ (పిఠాపురం) వంటి నేతలున్నారు. వీరికి ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ పదవులను ప్రకటించనున్నారని తెలుస్తోంది.