Begin typing your search above and press return to search.

టీడీపీ సేఫ్...తేల్చుకోవాల్సింది వైసీపీ జనసేన ?

జనసేన టార్గెట్ 2029 అని కూడా ప్రచారంలో ఉంది. ఇక అయిదేళ్ళ పాటు పాలించి 2024లో ఓడిన వైసీపీ టార్గెట్ కూడా 2029 ఎన్నికలే అవుతాయి.

By:  Tupaki Desk   |   19 Jun 2024 5:22 PM GMT
టీడీపీ సేఫ్...తేల్చుకోవాల్సింది వైసీపీ జనసేన ?
X

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన మెజారిటీని సాధించింది. టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయం సొంతం చేసుకుంది. మొత్తం 144 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే 135 దక్కాయి. అంటే కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే ఆ పార్టీ ఓడింది అన్న మాట. అలాగే 17 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే 15 దక్కాయి. రెండు సీట్లను కోల్పోయి భారీ విజయాన్నే సాధించింది.

ఇక ఈ విజయం కేవలం అయిదేళ్లకు మాత్రమే పరిమితం కాదు, టీడీపీకి మరో నలభై ఏళ్లకు సరిపడా టానిక్ ని ఇచ్చింది. 1983లో అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఎన్టీఆర్ కేవలం పద్నాలుగేళ్ల పాటు సారధ్యం వహిస్తే దాదాపు మూడు దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీని మోస్తున్నారు.

ఈ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని పార్టీకి అందించిన బాబు మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేతగా కొనసాగుతారు. అందులో ఎవరికీ డౌట్లు అవసరం లేదు. ఈలోగానే తన వారసుడిగా నారా లోకేష్ ని తీర్చిదిద్దుతారు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి చాలా సేఫ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికలకు రెడీ అయిపోయింది అని చెప్పాలి.

ఇక టీడీపీకి ఆపోజిట్ గా ఉండి ఏపీలో ఆల్టర్నేషన్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ జనసేనలు మాత్రమే అని అంటున్నారు. జనసేన ఈ రోజుకు కూటమిలో ఉన్నా రానున్న కాలంలో ఏపీలో అధికారంలోకి రావాలని ఆశతోనే పనిచేస్తోంది అన్నది నిర్వివాదాంశం.

జనసేన టార్గెట్ 2029 అని కూడా ప్రచారంలో ఉంది. ఇక అయిదేళ్ళ పాటు పాలించి 2024లో ఓడిన వైసీపీ టార్గెట్ కూడా 2029 ఎన్నికలే అవుతాయి. ఈ ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయి అని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయితే వైసీపీకే ఇబ్బంది. జనసేనకు కూడా పోయేది ఏమీ లేదు.

ఇక ఏపీలో చూస్తే టీడీపీ పటిష్టంగా ఉంది. సేఫ్ పొజిషన్ లో ఉంది. మరో సారి గెలిచే విధంగానూ పార్టీని ఈ అయిదేళ్ళలో బాబు రెడీ చేసి పెడతారు అని అంటున్నారు. ఇక మీదట టీడీపీకి నూతన నాయకత్వం కూడా తయారవుతుంది. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న లోకేష్ మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీని లీడ్ చేయగలరని అంటున్నారు. మొత్తానికి టీడీపీ లైఫ్ అండ్ డెత్ అన్న ఎన్నికల నుంచి సేఫ్ గా బయటపడి ఇంతకు ఇంత ఆయుష్షుని పోసుకుంది అని అంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీని ఢీ కొనే పార్టీలలో జనసేన ముందు ఉంటుందా వైసీపీ ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. రానున్న రోజులలో వైసీపీ టీడీపీతో తలపడాలీ అంటే ముందు జనసేనతో పోటీ పడాలి. అంటే సెమీస్ గెలవాలి ఆ మీదట ఫైనల్స్ అన్న మాట. మరి సెమీస్ లో ఎవరు గెలుస్తారు అన్నదే ఇపుడు చర్చ.

ఏది ఏమైనా వైసీపీకి ఇది అత్యంత పరీక్షా సమయం అని అంటున్నారు. ఏ మాత్రం ఉదాశీనంగా ఉన్నా వైసీపీ ప్లేస్ ని జనసేన ఆక్రమించేసే ప్రమాదం ఉంది అని అంటున్నారు. జనసేన అధికారంలో ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజిలో ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం సీఎం ఆకాంక్షలు జనసేనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు.