Begin typing your search above and press return to search.

తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే!

ఈ నేపథ్యంలో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చే యడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటన కూడా చేసింది

By:  Tupaki Desk   |   22 Sep 2023 6:46 AM GMT
తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే!
X

ఈ ఏడాది డిసెంబర్‌ లోపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు లేవని దాదాపు తేలిపోయింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ లో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్‌ లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో పోలింగ్‌ ఉంటుందని టాక్‌.

ఈ నేపథ్యంలో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చే యడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటన కూడా చేసింది. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా జనసేన కేవలం 32 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. ఈ 32 సీట్లలో అధిక భాగం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పరిధిలోనే ఉన్నాయని తెలుస్తోంది. కూకట్‌ పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌ నగర్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, పఠాన్‌ చెరు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ తదితర స్థానాల నుంచి జనసేన పోటీ చేయొచ్చని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు గతంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును తొలగించింది. మళ్లీ కొద్ది రోజుల క్రితం దాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేసే 32 నియోజకవర్గాలకు ఇంచార్జులను ప్రకటించింది. మరోవైపు ఏపీలో బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలు, అంతకుముందు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. తటస్థంగా వ్యవహరించింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె పోటీ చేయడంతో ఆమెకు పవన్‌ మద్దతు ప్రకటించారు.

ఏపీలో తమతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ తెలంగాణలో మాత్రం తమను కనీసం సంప్రదించకపోవడం, పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండటంతో పవన్‌ తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు.

మరోవైపు జనసేన పార్టీకి మరో గండం పొంచి ఉంది. జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఈ పార్టీ గుర్తు.. బకెట్‌. ఇది అచ్చం జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును పోలి ఉంది. దీంతో జనసేన కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనసేన పార్టీని దెబ్బకొట్టడానికి, జనసేనకు పడే ఓట్లను డైవర్ట్‌ చేయడానికి కొత్త పార్టీని బరిలో దింపారని విమర్శిస్తున్నారు. ఆ పార్టీ గుర్తు అచ్చం జనసేన గుర్తును పోలి ఉందని ఆరోపిస్తున్నారు. అభిమానులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలకే పవన్‌ కళ్యాణ్‌ పైన ఇలాంటి చీప్‌ ట్రిక్సుకు పాల్పడుతున్నవారు వచ్చే ఏడాది జరిగే ఏపీ ఎన్నికల్లోనూ ఇలాంటివే చేసే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రభావం ఏమీ ఉండదని ఓవైపు చెబుతూ, ఆయనను తక్కువ చేస్తూ.. మరోవైపు భయంతో ఇలాంటి పనులు చేస్తున్నవారిని చూస్తుంటే.. ఆయనంటే ఎంత భయం ఉందో అర్థం అవుతోందని జనసేన శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.