ఏపీలో జనసేనకు పోటీగా మరో జనసేన... తెరపైకి కూకట్ పల్లి టెన్షన్!
ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిలవాలని టీడీపీ - జనసేన కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Dec 2023 5:25 AM GMTఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిలవాలని టీడీపీ - జనసేన కలిసి ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాపు ఓట్లు అత్యంత కీలకం అని చెబుతున్న నేపథ్యంలో... జనసేన అధినేత పవన్ ను చంద్రబాబు గట్టిగానే పట్టుకున్నారని అంటున్నారు. అయితే... సీట్ల విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏపీలో మరో జనసేన రంగంలోకి దిగబోతుంది.
ఈసారి ఏపీలో టీడీపీకి కాపు సామాజీవర్గ ఓట్లు కీలకం కాబోతున్నాయని బాబు & కో బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో కాపు ఓట్లలో చీలిక దిశగా సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... టీడీపీతో పొత్తు అనగానే జనసేనలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక వారాహి యాత్రలో భాగంగా ముద్రగడపై విమర్శలు చేయడంతో మరికొంత చీలిక వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
ఇక తాజాగా టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే అనుభవజ్ఞుడు, సమర్ధుడు అయిన చంద్రబాబే సీఎం అని లోకేష్ సూటిగా సుత్తిలేకుండా స్పష్టం చేప్పారు. ఈ స్టేట్ మెంట్ మరోసారి జనసేనలో కలకలం రేపిందని అంటున్నారు. ఇది కూడా కాపు సామాజికవర్గాల్లో పునరాలోచనకు దారితీసిందనే కామెంట్లు వినిపిస్తునాయి. మరోపక్క సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెంట నడిచేవారిలో కూడా కాపు సామాజికవర్గానికి చెందిన కీలక వ్యక్తులు ఉండొచ్చని అంటున్నారు.
ఇవన్నీ ఏపీలో కాపు ఓటు బ్యాంక్ చీలికలో కీలక భూమిక పోషించే విషయాలే అనే చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో జనసేనకు 60 సీట్ల వరకూ ఇవ్వని పక్షంలో... 25 సీట్లు ఇచ్చి 150 స్థానాల్లో జనసేన ఓట్లు దక్కించుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తే.. అది కూడా మరో చీలికకు కారణం అవ్వొచ్చని అంటున్నారు. ఈ సమయంలో భారతీయ జనసేన పార్టీ ఏపీలో ఎంటరైంది. ఆ పార్టీ ఏపీ కమిటీ ప్రెసిడెంట్ కే. పవన్ కల్యాణ్!!
అవును... ఏపీలో కోనంకి పవన్ కల్యాణ్ చీఫ్ గా భారతీయ జనసేన పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏముందిలే ఎన్నికలు అన్నతర్వాత చిన్న చితకా కొత్త కొత్త పార్టీలు పుట్టుకురావడం సహజం అనుకుంటే పొరపాటే! కారణం... ఈ పార్టీ పేరు భారతీయ జనసేన పార్టీ తో పాటు ఆ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్! ఈవీఎంలో ఈ సింబల్ గాజు గ్లాసుకు చాలా దగ్గరగా ఉంటుందనేది ఇప్పుడు కొత్త టెన్షన్!
వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కీలకమైన కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పోటీచేశారు. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనసేన పార్టీ కూడా తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆ బకెట్ గుర్తుకి సుమారు 800 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఏపీలో ఇది కొత్త టెన్షన్ అని అంటున్నారు పరిశీలకులు.
ఏపీలో గ్రామీణ ఓటర్లు ఎక్కువగానే ఉంటారు.. అందునా కాస్త పెద్ద వయసు వచ్చిన వారి సంఖ్య ఉండనే ఉంటుంది.. ఈ సమయంలో బ్యాలెట్ బాక్స్ లో గాజు గ్లాసు, బకెట్ సుమారుగా ఒకేలా కనిపించే ప్రమాదం లేకపోలేదు. దీంతో... కూకట్ పల్లిలో 800 వరకూ ఓట్లు పోలైనట్లు.. ఏపీలో సుమారు 1000 - 1500 ఓట్ల వరకు బకెట్ కి పడితే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు కారు గుర్తుకు దగ్గరగా ఉందంటూ బీఅరెస్స్ నేతలు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లలో ఈ ప్రభావం కూడా ఉందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... ఏపీలో గాజుకు అత్యంత సమీపంగా ఉన్న బకెట్ గుర్తు ఇప్పుడు జనసేన - టీడీపీ కూటమిలో కొత్త టెన్షన్ క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ సమస్యకు టీడీపీ - జనసేన ఎలా చెక్ పెడతాయనేది వేచి చూడాలి.