జనసేన అదే అయోమయం.. గజిబిజి!
పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లు తీసుకోవడంపైన జనసేన పార్టీ నేతలు, శ్రేణులు, పవన్ అభిమానులు మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 March 2024 4:52 AM GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు, బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
అయితే జనసేన వ్యవహారం మాత్రం ఇప్పటికీ కుదుటపడలేదు. కూటమిలోని మిగతా రెండు పార్టీలు.. టీడీపీ, బీజేపీ తాము పోటీ చేసే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా జనసేన మాత్రం ఇంకా మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో అభ్యర్థులను ప్రకటించడానికి కిందామీద అవుతోందని అంటున్నారు.
కూటమిలోకి చాలా ఆలస్యంగా బీజేపీ చేరింది. అసలు టీడీపీ, జనసేనలతో బీజేపీ చేరుతుందా, లేదా అనేది కూడా చివరి వరకు అనుమానాస్పదంగా మారింది. అసలు ఆ పార్టీకి అభ్యర్థులే లేరనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది బీజేపీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఇంతవరకు జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించకపోవడంపై ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లు తీసుకోవడంపైన జనసేన పార్టీ నేతలు, శ్రేణులు, పవన్ అభిమానులు మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎందుకు 24 సీట్లలో పోటీ చేస్తున్నానో కూడా పవన్ గాయత్రి మంత్రానికి లింక్ చేసి చెప్పారు. దీనిపైనా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. పోనీ ఆ 24 సీట్లలో అయినా పోటీ చేస్తున్నారా అంటే అదీ లేదు. చివరకు ఈ సీట్లు 21కి తెగ్గోసుకుపోయాయి. అలాగే ముందనుకున్న మూడు పార్లమెంటు 2 సీట్లకు కుదించుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఇప్పుడు ఏ మంత్రం చెబుతావు పవన్ అన్నా’ అంటూ జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులే సైటెర్లు వేశారు.
పోనీ ఈ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి పవన్ దిగారా అంటే అదీ లేదు. ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలకు విశాఖపట్నం దక్షిణం, పాలకొండ (శ్రీకాకుళం జిల్లా), అవనిగడ్డ (కృష్ణా జిల్లా) అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపీ అభ్యర్థి అని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఆయన సైతం తానే జనసేన అభ్యర్థినని చెప్పుకున్నారు. అయితే ఈ స్థానాన్ని కూడా ఇంతవరకు పవన్ ఖరారు చేయకపోవడం పట్ల జనసేన శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.
అందులోనూ జనసేన బలంగా ఉన్న స్థానాలను కూడా ఎక్కడో నెల్లిమర్ల, పాలకొండ అంటూ జనసేన బలంగా లేని స్థానాల్లో పోటీ చేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పి.గన్నవరం, రైల్వేకోడూరు, రాజోలు, పోలవరం, పాలకొండ ఇలా ఎక్కువ రిజర్వుడ్ సీట్లు తీసుకోవడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో రెండు మినహా అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ సీట్లు మనకెందుకన్నా పవన్ మాత్రం తన వ్యూహం తనకుందని అంటున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే జనసేన బలపడకపోవడానికి కార్యకర్తలు, అభిమానులే కారణమంటూ నింద మొత్తం వారిపైన మోపి వారి ఆగ్రహానికి గురయ్యారు.. పవన్. ఇక తీసుకున్న తక్కువ సీట్లలోనూ అభ్యర్థులను ఫైనలైజ్ చేయలేకపోవడం.. అసలు ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అంటూ అధికార పక్షం వైసీపీ చేస్తున్న విమర్శలను నిజం చేసేలా ఉందని అంటున్నారు. ఫైనల్ గా ‘నీకో దండం.. నీ వ్యూహానికో దండం రా బాబూ’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు తమ వాట్సాప్ స్టేటస్ ల్లో, సోషల్ మీడియాల్లో పోస్టుల్లోనూ పెట్టుకుని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.