హార్డ్ కోర్ రీజియన్ లో జనసేనకు షాకులు...!?
జనసేన అంటే తమ ప్రాణం కంటే ఎక్కువగా భావించి జెండా కోసమే బతికిన జనసైనికులను పవన్ తీరని అన్యాయం చేశారు అని మండిపడ్డారు.
By: Tupaki Desk | 4 April 2024 2:30 PM GMTజనసేనకు హార్డ్ కోర్ రీజియన్ ఏది అంటే తడుముకోకుండా అంతా చెప్పే మాట గోదావరి జిల్లాలు అని. అలాంటి చోట జనసేన బలం పవన్ వారాహి యాత్రతో రెట్టింపు అయింది. ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీని లేకుండా చేస్తామని పవన్ వారాహి రధమెక్కి గర్జిస్తే అంత పని అవుతుందేమో అనుకున్న వారూ ఉన్నారు.
అంతలా పవన్ వారాహి యాత్రకు బ్రహ్మరథం పట్టిన చోట ఆ పర్టీ తప్పటడుగులు వేయడంతో ఇపుడు అంతా ఉల్టా సీదా అవుతోంది అని అంటున్నారు. జనసేన టీడీపీతో పొత్తులు పెట్టుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించలేదు కానీ తమకు బలం ఉన్న సీట్లను కూడా పొత్తులో పట్టుబట్టి తీసుకోకుండా వదిలేయడం ఇచ్చిన సీట్లతో సర్దుకొని పోవడం వల్లనే ఇపుడు ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.
పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన వారికి సీట్లు దక్కలేదు. దాంతో గోదావరి జిల్లా జనసేన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముమ్మిడివరం లో సీనియర్ నేత పితాని బాలక్రిష్ణ జనసేనకు గుడ్ బై కొట్టి వైసీపీలో చేరిపోయారు.
ఇపుడు మరో బలమైన ప్రాంతం కోనసీమకు చెందిన జనసేన ముఖ్య నేత అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేసారు. ఆయన అధినేత పవన్ కళ్యాణ్ తీరుని పూర్తిగా తప్పుపట్టారు. పార్టీకి బలం అయిన ప్రాతాలలో పొత్తు పేతుతో పార్టీని బలిపెట్టారని మండిపడ్డారు. ఈ కీలకమైన సీట్లను టీడీపీకి దారాదత్తం చేసారు అని ఫైర్ అయ్యారు.
జనసేన అంటే తమ ప్రాణం కంటే ఎక్కువగా భావించి జెండా కోసమే బతికిన జనసైనికులను పవన్ తీరని అన్యాయం చేశారు అని మండిపడ్డారు. అమలాపురం జనసేనకు గుండెకాయ లాంటి సీటు అని ఆయన గుర్తు చేశారు. ఇపుడు ఆ సీటు టీడీపీకి ఇచ్చేశారని విమర్శించారు.
ఇక శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన అన్నీ మాట్లాడుకున్నారు అని అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో సీట్లను బలంగా ఉన్న చోట తీసుకోలేదని జనసేనలో రగులుతున్న నేతలు ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వైసీపీలో చేరనున్నారు. రానున్న రోజుల్లో ఆపరేషన్ జనసేన అంటోంది వైసీపీ. బిగ్ షాట్స్ తో పాటు కీలక నేతలు చాలా మంది జనసేనను వీడుతారు అని అంటున్నారు. ఇదంతా జనసేన అధినాయకత్వం చేసుకున్నదే అని వెళ్ళిపోతున్న నేతలు నిందలు వేస్తున్నారు.