Begin typing your search above and press return to search.

త్యాగం కాదు : పొత్తుతో చిత్తు అవుతున్న జనసేన !

రాజకీయం అంటే త్యాగం కాదు. త్యాగానికి అక్కడ అర్థం లేదు. ఎవరి కోసమో పనిచేయడానికి రాజకీయ పార్టీ స్వచ్చంద సంస్థ కాదు

By:  Tupaki Desk   |   10 April 2024 3:48 AM GMT
త్యాగం కాదు : పొత్తుతో చిత్తు అవుతున్న జనసేన !
X

రాజకీయం అంటే త్యాగం కాదు. త్యాగానికి అక్కడ అర్థం లేదు. ఎవరి కోసమో పనిచేయడానికి రాజకీయ పార్టీ స్వచ్చంద సంస్థ కాదు. అలా అధినాయకుడు అనుకున్నా ఆయన వెంట నడవడానికి అనుచరులు సిద్ధంగా ఉండరు. రాజకీయం అంటే పదవి కోసమే. అంతిమ లక్ష్యం అధికారమే.

ఒకపుడు అంటే 1983కి ముందు ఒక నాయకుడు మొదటి సారి ఎమ్మెల్యే కావాలంటే యాభై ఏళ్ళు వచ్చేసేవి. ఆయన ముందు తన వార్డు లో కౌన్సిలర్ గానో లేక పంచాయతీ మెంబర్ గానో గెలిచి రాజకీయం మొదలెట్టేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యేసరికి సగం వయసు పూర్తి అయ్యేది. ఇక ఆయనకు మంత్రి పదవి రావాలి అంటే మరో రెండు టెర్ములు ఎమ్మెల్యేగా గెలవాల్సిందే.

ఇక మంత్రి అయినా పెద్ద శాఖ కాదు పూర్తి అధికారంతో కాదు ముందు సహాయ మంత్రి ఇచ్చి చిన్న శాఖలను చేయమనే వారు. అలా సీనియర్ మంత్రి అయ్యేనాటికి రాజకీయం ముగిసిపోయేది. కొందరికి మాత్రమే సీఎం అయ్యే చాన్స్ ఉండేది. ఇది నిజంగా మంచి విధానమే. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చేవారికి పంచాయతీ స్థాయి సమస్యలు కూడా పూర్తిగా అర్ధం అవుతాయి. రాష్ట్రం గురించి సమగ్రమైన అవగాహన ఉంటుంది.

కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక పాతికేళ్ళు పట్టుమని ఉన్న వారు అంతా ఎమ్మెల్యేలు ఆ మీదట మంత్రులు అయిపోయారు. దాంతో నాటి నుంచి షార్ట్ కట్ మెదడ్ లో అధికారం అందుకోవాలన్న ఆకాంక్ష అందరిలో వచ్చింది. చిత్రమేంటి అంటే జనసేన అధినేత ఆలోచనలు పాత కాంగ్రెస్ కాలం నాటివిగా ఉన్నాయి.

ముందు పార్టీ కోసం పనిచేయండి అని ఆయన తన వారిని కోరుతున్నారు. అధికారం కాదు రాష్ట్రం ముఖ్యం అంటున్నారు. ఆయన లక్ష్యం వైసీపీని దించేయాలి. తాను అధికారంలోకి రాకపోయినా ఓకే. టీడీపీని గెలిపించాలి. అయితే ఇది ఆయన వెంట ఉన్న వారిలో చాలా మందికి అర్థం కావడంలేదు. ఎన్నికల్లో పోటీ అంటే తాము రేసులో ఉండాలి.

తమకూ ఎమ్మెల్యే పదవులు కావాలి. ఆ మీదట అధికారంలో తామూ ఉండాలి అనేది వారి కోరిక. పొత్తులలో భాగంగా డెబ్బై దాకా సీట్లు జనసేనకు వస్తాయని అనుకున్నారు. నిజం చెప్పాలంటే అలా కొంతమంది ప్రచారం చేశారు. అయితే వాస్తవంగా రాజకీయ విశ్లేషకులు అయితే కనీసంగా నలభై సీట్లు అయినా జనసేనకు దక్కుతాయని అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే అందులో సగం వచ్చాయి. ఆ వచ్చిన వారిలో కూడా సగానికి సగం టీడీపీ నుంచి వచ్చిన వారికి వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఏమిటి అంటే గెలుపు గుర్రాలు వ్యూహం అంటున్నారు. దీంతో పార్టీ జెండా మోసిన వారికి ఇది తీరని అసహానికి గురి చేస్తోంది.

మరో వైపు చూస్తే పొత్తులలో కూడా సీట్లు జనసేన త్యాగం చేస్తోంది. బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కావాలన్నా విజయవాడ వెస్ట్ కావాలన్నా జనసేన నుంచే ఇవ్వాల్సి వస్తోంది. దీంతోనే జనసేనలో ఉన్న వారు రగులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కనీసంగా పదిహేను సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని అందులో చాలా సీట్లలో బలమున్న నేతలకు దక్కుతాయనుకుంటే అసలు వీలు పడలేదు. అందుకే చాలా మంది పార్టీని వీడిపోతున్నారు.

ఇలా చూసుకుంటే ముమ్మిడివరం, అమలాపురంలలో నియోజకవర్గం ఇంచార్జీలుగా పనిచేసిన పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అలాగే ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బీవీ రావు సైతం పార్టీకి గుడ్ బై కొట్టేశారు. విజయవాడ పశ్చిమ ఇంచార్జి పోతిన మహేష్ పార్టీకి దండం పెట్టారు.

వీరి తరువాత వరసలో మరింతమంది నేతలు ఉన్నారు అని అంటున్నారు. దానికి కారణం అధినాయకత్వం స్వీయ తప్పిదాలే అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేన అవసరం టీడీపీకే ఉంది. పట్టుబట్టి కనీసం నలభై సీట్లు సాధించి అందులో పార్టీ కోసం కష్టపడిన వారిని దించితే ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ అలా చేయలేదు.

దానికి తోడు టీడీపీతో పొత్తు మరో పదేళ్ళ పాటు ఉండాలని పవన్ పదే పదే చెప్పడంతో ఇక ఈ పార్టీలో ఇంతేనా అన్న డౌట్లను కలుగచేశారు. తెలుగుదేశంతో పొత్తు అంటే మిత్రపక్షాలు ఎక్కడా బతికి బట్ట కట్టలేదు అని అంటారు. ఇక జనసేన టికెట్లలో పోటీ చేస్తున్న మాజీ తమ్ముళ్ళు గెలిస్తే ఎక్కడ ఉంటారో కష్టకాలం వస్తే జెండా ఏ వైపు ఎత్తుతారో కూడా ఆ మాత్రం రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలిసే విషయమే.

ఇవన్నీ చూసిన వారు జనసేనలో భవిష్యత్తు కష్టం అనుకుని గోడ దూకుతున్నారు. అయితే కొందరు నేతలు ఇంకా జనసేనలో ఉన్నారు రేపటి రోజున కూటమి అధికారంలోకి రాకపోతే వారు కూడా ఏ వైపు ఉంటారో ఎవరూ చెప్పలేరు. మొత్తానికి చూస్తే 2014లో ఆవేశపూరితంగా ప్రసంగం చేసి జనసేనను స్థాపించిన తీరుని చూస్తే ఎంతో అంతా ఊహించారు. కానీ ఆ పార్టీ పదేళ్ల ప్రస్థానం మాత్రం సవ్య దిశలో సాగలేదనే అంటారు.

రేపటి రోజున టీడీపీ కూటమి గెలిచినా జనసేన పొత్తులో తీసుకున్న 21 సీట్లలోనూ నూరు శాతం గెలిచినా టీడీపీ రాజకీయాన్ని తట్టుకుని నిలబడడం అంటే ఒక అద్భుతమే అంటున్న వారూ ఉన్నారు. టీడీపీ కంటే వైసీపీతోనే ఎదురు నిలిచి పోరాడడమే జనసేనకు సులువు. కానీ ఆ పార్టీ వ్యూహాలు వేరుగా ఉన్నాయి. మొత్తానికి త్యాగాలు రాజకీయాల్లో పనిచేస్తాయా అంటే జవాబు జనసేన రేపటి రాజకీయ చిత్రమే చెప్పాల్సి ఉంటుంది.